వింబుల్డన్: టెన్నిస్ అభిమానులను అలరించేందుకు మరో గ్రాండ్‌స్లామ్ టోర్నీ సిద్ధమైంది. నేటి నుంచి సీజన్ మూడో గ్రాండ్‌స్లామ్ ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ ప్రారంభం కానుంది. పురుషుల సింగిల్స్‌లో మరే ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో ఇప్పటికే 23 టైటిల్స్ సాధించి అగ్రస్థానంలో ఉన్న సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా.. ఈసారైనా అతడిని అడ్డుకోవాలని స్పెయిన్ యంగ్ గన్, టాప్ సీడ్ కార్లోస్ అల్కరాజ్ తహతహలాడుతున్నాడు.
ఆల్ ఇంగ్లండ్ క్లబ్లో ఇప్పటి వరకు ఏడుసార్లు విజేతగా నిలిచిన 36 ఏండ్ల జొకోవిచ్ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కాచిన్‌తో తలపడనున్నాడు. నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో అతి పురాతనమైన వింబుల్డన్‌లో పురుషుల సింగిల్స్‌లో రోజర్ ఫెదరర్ 8 టైటిల్స్ సాధించగా.. జొకో ఒక్క అడుగు వెనక ఉన్నాడు.
మరోవైపు టెన్నిస్ యవనికపై ఉత్తుంగ తరంగంలా దూసుకొస్తున్న ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ తొలి రౌండ్లో చార్డీతో అమీతుమీ తేల్చుకోనున్నాడు. ఈ ఇద్దరితో పాటు మెద్వెదేవ్, రూన్, థీమ్, ఆండీ ముర్రే కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల సింగిల్స్‌లో ఫ్రెంచ్ ఓపెన్ విజేత స్వియాటెక్ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతుండగా.. సీనియర్ ప్లేయర్ వీనస్ విలియమ్స్ వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనుంది.