Angelo Mathews : శ్రీలంక మాజీ కెప్టెన్ ఆంజెలో మాథ్యూస్ (Angelo Mathews) సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నాడు. త్వరలోనే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తానని శుక్రవారం మాథ్యూస్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా వెల్లడించాడు. జూన్ 17 బంగ్లాదేశ్‌తో గాలే స్టేడియంలో జరుగబోయే మొదటి టెస్టు తర్వాత ఈ ఆల్‌రౌండర్ ఆటకు అల్విదా పలకనున్నాడు. దాంతో, అతడి 16 ఏళ్ల కెరియర్‌కు ఎండ్ కార్డు పడనుంది.
ఇదే మైదానంలో 2009లో మాథ్యూస్ తన టెస్టు కెరీర్‌ను ప్రారంభించాడు. అయితే.. వన్డేలు, టీ20లకు మాత్రం అందుబాటులో ఉంటానని వెల్లడించాడీ స్టార్ ప్లేయర్. ‘టెస్టులకు వీడ్కోలు పలికేందుకు సమయం ఆసన్నమైంది. క్రికెట్ కోసం నేను ఎంతో చేశాను. బదులుగా నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. ఆట వల్లనే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. గాలే టెస్టుతో నా టెస్టు కెరీర్ ముగియనుంది. pic.twitter.com/nqsnpkpekD
— Angelo Mathews (@Angelo69Mathews) May 23, 2025
ఇన్నేళ్లు నాకు అన్ని వేళలా మద్దతుగా నిలిచిన శ్రీలంక క్రికెట్‌కు.. ఒడిదొడుకులు ఎదుర్కొన్న వేళల్లోనూ అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రస్తుత జట్టులో ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టు కచ్చితంగా ఆటలో ఉన్నత దశకు చేరుకుంటుంది. అందుకే.. నా స్థానంలో యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నా’ అని మాథ్యూస్ వెల్లడించాడు.
స్వదేశంలో సొంత ప్రేక్షకుల సమక్షంలో చివరిసారి తెలుపు జెర్సీ వేసుకోనున్నాడు మాథ్యూస్. జూన్ 17న గాలేలో జరుగబోయే మ్యాచ్ ఈ లెజెండరీ ఆల్‌రౌండర్‌కు 119వది. ఇందులో 34 టెస్టులకు అతడు సారథిగా వ్యవహరించాడు. ప్రస్తుతం శ్రీలంక తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో మాథ్యూస్ మూడో స్థానంలో ఉన్నాడు.
మాజీ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహేళ జయవర్ధనేలు అతడికంటే ముందున్నారు. సుదీర్ఘ ఫార్మాట్లో మాథ్యూస్ ఖాతాలో 8,167 రన్స్ ఉన్నాయి. 16 సెంచరీలు బాదిన అతడి అత్యధిక స్కోర్.. 200 నాటౌట్. బంతితోనూ చెలరేగుతూ 33 వికెట్లు పడగొట్టాడీ వెటరన్ ప్లేయర్.