Ajit Doval : భారతదేశ జాతీయ భద్రతాసలహాదారు (National Security Adviser) అజిత్ దోవల్ (Ajit Doval ) వచ్చే వారం రష్యా (Russia) పర్యటనకు వెళ్లనున్నారు. భారత ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించాయి. భారతసైన్యం పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) పేరుతో ఈ నెల ఆరంభంలో పాకిస్థాన్ (Pakistan) లోని, పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్ (PoJK) లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసి మొత్తం 9 స్థావరాలను ధ్వంసం చేసింది.
ఏకంగా వంద మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో అజిత్ దోవల్ రష్యా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దిగుమతి కోసం భారత్ కొత్త ఆర్డర్లు ఇచ్చిందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో దోవల్ రష్యాకు వెళ్తున్నారు. భారత్ ఇప్పటికే ఆర్డర్ చేసిన వాటిలో మరో రెండు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ దిగుమతి కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ రెండు S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ను సాధ్యమైనంత తొందరగా భారత్‌కు డెలివరీ ఇవ్వాలని తొందరపెట్టేందుకే ఆయన అక్కడికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రష్యాలో పర్యటిస్తున్న భారత ఎంపీల పర్యటనకు కొనసాగింపుగా దోవల్ పర్యటన జరగనుంది. మే 27 నుంచి 29వ తేదీ వరకు రష్యా రాజధాని మాస్కోలో.. భద్రతా అంశాలపై ఉన్నతస్థాయి ప్రతినిధుల అంతర్జాతీయ సమావేశం జరగనుంది. వివిధ దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. అజిత్ దోవల్ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉన్నది.