పిట్ట కొంచెం కూత ఘనమన్నట్లు..పసి ప్రాయం నుంచే అతను బ్యాడ్మింటన్‌లో అదరగొడుతున్నాడు. ఊహ తెలియని వయసు నుంచే కోర్టులో పాదరసంలా కదులుతూ ప్రత్యర్థి పనిపడుతున్నాడు. ఐదేండ్ల వయసులోనే రాకెట్ పట్టిన అతను జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణిస్తూ జాతీయస్థాయికి ఎదిగాడు. పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ ఉంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని చేతల్లో నిరూపిస్తున్నాడు హైదరాబాదీ ఆనేకాళ్ల భవేశ్రెడ్డి. చిన్నవయసు నుంచే ఆటను అమితంగా ప్రేమిస్తూ పోటీకి దిగిన ప్రతి టోర్నీలో భవేశ్ ప్రతిభ కనబరుస్తూ అనతికాలంలోనే అందరి మన్ననలు పొందాడు.
నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ, కోచ్‌ల సలహాలు, సూచనలకు తోడు ఆటలో మెళకువలు పాటిస్తూ దూసుకెళుతున్నాడు. గడిచిన ఏడేండ్ల కాలంలో జోనల్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ దృష్టిలో పడ్డాడు. భవేశ్ ప్రతిభను గుర్తించిన గోపీచంద్..ఆయన అకాడమీలో చోటు కల్పించాడు. సీనియర్ కోచ్‌ల సమక్షంలో శిక్షణ పొందుతున్న 13 ఏండ్ల భవేశ్ అండర్-13 విభాగంలో అప్రతిహత విజయాలతో ప్రస్తుతం జాతీయస్థాయిలో రెండో ర్యాంక్‌కు చేరుకుని ఔరా అనిపించుకున్నాడు. భవిష్యత్‌లోనూ ఇదే ఒరవడి సాధిస్తూ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించాలన్న ఏకైక లక్ష్యంతో ముందుకెళుతున్నాడు.
వీణారెడ్డి, రమణారెడ్డి దంపతులకు లిఖిత్‌రెడ్డి, భవేశ్రెడ్డి ఇద్దరు కొడుకులు. వీరిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి నమస్తే తెలంగాణ పత్రికలో జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తల్లి గృహిణి. తండ్రి రమణారెడ్డికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. క్రికెట్లో ప్రతిభ ఉన్నప్పటికీ కుటుంబసభ్యుల నుంచి సరైన ప్రోత్సాహం లభించలేదు. దీంతో బ్యాడ్మింటన్‌ను ఎంచుకున్నాడు.
తన తండ్రినే ప్రేరణగా చేసుకుంటూ భవేశ్..బ్యాడ్మింటన్ వైపు అడుగులు వేశాడు. ఐదేండ్ల వయసులో రాకెట్ పట్టిన భవేశ్..తొలుత తన నిర్ణయాన్ని తల్లితో పంచుకున్నాడు. చదువు, ఆటను రెండింటిని సమన్వయం చేసుకోవడం కష్టమవుతుందని ఆమె సూచించింది. ఆటపై ఉన్న మక్కువను గమనించిన తల్లిదండ్రులు బ్యాడ్మింటన్‌లో కోచింగ్ ఇప్పించేందుకు సిద్ధమయ్యారు. భవేశ్లోని ప్రతిభను గుర్తించిన శ్రీవిద్యా పాఠశాల మేనేజ్మెంట్ ప్రోత్సహించింది.
దాదాపు మూడేండ్లుగా దిగ్గజ షట్లర్ గోపీచంద్ దగ్గర భవేశ్ శిక్షణ పొందుతున్నాడు. రాష్ట్ర, జాతీయ స్థాయి అండర్-13 టోర్నీల్లో సింగిల్స్, డబుల్స్‌లో సత్తాచాటుతూ లెక్కకు మిక్కిలి ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు.