దుబాయ్: ఆసియాకప్‌లో సూపర్ ఫోర్లో భాగంగా సెప్టెంబర్ 21వ తేదీన భారత్, పాక్ జట్లు తలపడనున్నాయి. ఆదివారం జరిగే ఆ మ్యాచ్‌కు కూడా రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్(Andy Pycroft)ను నియమించారు. ఎలైట్ ప్యానెల్ లో ఉన్న పైక్రాఫ్ట్ నే .. ఇండోపాక్ మ్యాచ్‌కు రిఫరీగా ఎంపిక చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి ఆదివారం మ్యాచ్‌కు చెందిన మ్యాచ్ అఫీషియల్స్ పేర్లను ఇంకా పబ్లిక్‌గా ప్రకటించలేదు. ఈ టోర్నీలో విండీస్ మాజీ ప్లేయర్ రిచీ రిచర్డ్సన్ కూడా మ్యాచ్ రిఫరీగా ఉన్నారు.
గత ఆదివారం ఇండో, పాక్ మ్యాచ్‌లో షేక్‌హ్యాండ్ వివాదం చెలరేగడంతో పైక్రాఫ్ట్‌ను టోర్నీ నుంచి తొలగించాలని పాకిస్థాన్ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. టాస్ సమయంలో, మ్యాచ్ గెలిచిన తర్వాత పాక్ క్రికెటర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. దీంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌పై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది.
ఐసీసీకి రెండు సార్లు పాక్ క్రికెట్ బోర్డు లేఖ కూడా రాసింది. తాము ఆడే మ్యాచ్‌ల నుంచి పైక్రాఫ్ట్‌ను తొలగించాలని కూడా డిమాండ్ చేసింది. అయితే ఆ రెండు డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. ఎలైట్ ప్యానెల్ రిఫరీలకు అండగా ఐసీసీ నిలిచింది.
పైక్రాఫ్ట్ విషయంలో పాకిస్థాన్ అసంతృప్తితో ఉన్నా.. ఐసీసీ మాత్రం ఆ ఎలైట్ ప్యానెల్ అంపైర్‌ను తొలగించేందుకు సుముఖంగా లేదు. దీంతో రెండోసారి కూడా ఆయనే రిఫరీగా చేసే అవకాశాలు ఉన్నాయి.
పెహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ పాక్ ప్లేయర్లకు భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.