SRH | కాంప్లిమెంటరీ పాసుల వ్యవహారంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) ఓ ఆఫర్ ఇచ్చింది.
హెచ్‌సీఏతో నెలకొన్ని వివాదం నేపథ్యంలో తమ రాష్ట్రానికి రావాలని ఆహ్వానించింది. ఈ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లను వైజాగ్ (Visakhapatnam) వేదికగా నిర్వహించాలని కోరింది. పన్ను మినహాయింపులు కూడా ఇస్తామని, అద్దె కూడా తీసుకోబోమని, ఇతర సహకారాలు కూడా అందిస్తామని తెలిపింది. సన్‌రైజర్స్ జట్టు నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది.
అదనపు కాంప్లిమెంటరీ పాసుల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తమను బెదిరిస్తున్నదని, ఈ విషయంలో బీసీసీఐ తక్షణమే జోక్యం చేసుకోకుంటే తాము హైదరాబాద్‌ను వదిలివెళ్తామని సన్‌రైజర్స్ విడుదల చేసిన ఈ-మెయిల్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై హెచ్‌సీఏ కూడా స్పందించింది. అసలు తమకు ఎస్ఆర్హెచ్ నుంచి ఎలాంటి ఈ-మెయిల్ రాలేదని ఓ ప్రకటన విడుదల చేసింది. కార్పొరేట్ బాక్సుల టికెట్ల విషయంలో మొదలైన రగడపై అటు ఎస్ఆర్హెచ్, ఇటు హెచ్‌సీఏ ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి. ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలోని మొత్తం సీటింగ్ కెపాసిటీలో 10 శాతం (3,900 సీట్లు) హెచ్‌సీఏకు సన్‌రైజర్స్ ఇవ్వాల్సి ఉంది.
ఇక తాజా వివాదం నేపథ్యంలో హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్. దేవ్‌రాజ్ సమక్షంలో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో మంగళవారం జరిగిన సమావేశంలో ఎస్ఆర్హెచ్ ప్రతినిధులు కిరణ్, శరవణన్, రోహిత్ పాల్గొని చర్చలు జరిపారు. చర్చల సందర్భంగా.. బీసీసీఐ, ఎస్ఆర్హెచ్, హెచ్‌సీఏ ట్రైపార్టీ ఒప్పందాన్ని కచ్చితంగా పాటించాలని, ఆ మేరకు స్టేడియం సామర్థ్యంలోని అన్ని విభాగాల్లో 10 శాతం కాంప్లిమెంటరీ పాసులను కేటాయించాలని హెచ్‌సీఏ ప్రతిపాదించగా దానికి ఎస్ఆర్హెచ్ అంగీకారం తెలిపింది. ఉప్పల్‌లో జరుగబోయే ఐపీఎల్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించేందుకు పూర్తిగా సహకరిస్తామని హెచ్‌సీఏ హామీ ఇచ్చింది. చర్చల అనంతరం వివాదం ముగిసిందని ఇరు వర్గాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అయితే, ఇప్పుడు ఎస్ఆర్హెచ్కు ఏసీఏ నుంచి ఆఫర్ రావడం గమనార్హం.
Also Read..
“SRH | హెచ్‌సీఏ vs ఎస్ఆర్హెచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను వదిలివెళ్లనుందా?”