భారత్, ఇంగ్లండ్ మధ్య అండర్సన్-టెండూల్కర్ టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతున్నది. రెండు అత్యుత్తమ జట్ల మధ్య పోరు అభిమానులను రంజింపజేస్తున్నది. గెలుపు కోసం కడదాకా కొట్లాడుతున్న వైనం టెస్టుల్లో మజాను అందిస్తున్నది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ గెలుపు బాటలో వెళుతున్నది. అంచనాలకు అనుగుణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న ఓవల్ పిచ్‌లో రికార్డు ఛేదన దిశగా ఇంగ్లండ్ అడుగులు వేస్తున్నది. 106 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును హ్యారీ బ్రూక్, జో రూట్ ఒడ్డున పడేశారు. టీమ్ఇండియా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ బాజ్‌బాల్ స్ఫూర్తిగా బ్రూక్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ తరహాలో ఆడితే ప్రియమైన ప్రత్యర్థిపై రూట్ మరో సెంచరీతో కదంతొక్కాడు. ఫలితంగా గెలుపు సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. లక్ష్యం వైపు సాఫీగా సాగుతున్న వేళ ప్రసిద్ధ్ కృష్ణ..వరుసగా బెతెల్, రూట్‌ను ఔట్ చేసి భారత శిబిరంలో మిణుకు మిణుకు అంటున్న గెలుపు ఆశలు చిగురింపజేశాడు. విజయానికి 35 పరుగుల దూరంలో ఇంగ్లండ్ ఉంటే మరో నాలుగు వికెట్ల దూరంలో టీమ్ఇండియా ఉన్నది. మొత్తంగా సిరీస్‌లో ఐదు టెస్టుల్లో ఫలితం మరోమారు ఆఖరి రోజే తేలబోతున్నది.
ఓవల్: భారత్, ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆఖరి ఫలితానికి ఆటంకం ఏర్పడింది. ఇరు జట్ల హోరాహోరీగా తలపడుతున్న మ్యాచ్‌లో గెలుపు దోబూచులాడుతున్నది. టీమ్ఇండియా నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యఛేదన కోసం నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ వర్షం అంతరాయం కల్గించే సమయానికి 339-6 స్కోరుతో నిలిచింది. జేమీ స్మిత్(2), జెమీ ఓవర్టన్(0) క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్(98 బంతుల్లో 111, 14ఫోర్లు, 2సిక్స్‌లు) ధనాధన్ సెంచరీకి తోడు జో రూట్(152 బంతుల్లో 105, 12ఫోర్లు) సమయోచిత సెంచరీతో ఇంగ్లండ్ రికార్డు ఛేదన దిశగా వెళుతున్నది. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఆరంభంలోనే..డకెట్(54), కెప్టెన్ పోప్(27)ను ఔట్ చేసి మెరుగైన శుభారంభం అందజేశారు. కానీ బ్రూక్ రంగప్రవేశం తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. టీమ్ఇండియా బౌలర్లను ఏమాత్రం లెక్కచేయకుండా బ్రూక్ దూకుడు మంత్రం పటిస్తే..రూట్ మరోమారు తన విలువ చాటుకున్నారు. వీరిద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 195 పరుగుల విలువైన భాగస్వామ్యంతో మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకున్నారు. ప్రసిద్ద్ (3-109), సిరాజ్(2-95) రాణించారు.
భారీ లక్ష్యఛేదన కోసం నాలుగో రోజు బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ను ప్రసిద్ధ్, సిరాజ్ ఆదిలోనే దెబ్బతీశారు. ఓవర్‌నైట్ బ్యాటర్ డకెట్‌ను ప్రసిద్ధ్ పెవిలియన్ పంపితే..మరోమారు సిరాజ్ వాబుల్సీమ్కు పోప్ బలయ్యాడు. పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఈ ఇద్దరు భారత పేసర్లు ఇంగ్లండ్ బ్యాటర్లకు పరీక్ష పెట్టారు. అర్ధసెంచరీతో ప్రమాదకరంగా మారుతున్న డకెట్‌ను..స్వింగ్ డెలివరీతో ప్రసిద్ధ్ బోల్తా కొట్టించాడు. వికెట్లకు దూరంగా వెళుతున్న బంతిని డ్రైవ్ ఆడే క్రమంలో స్లిప్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి డకెట్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. స్టోక్స్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పోప్‌ను సిరాజ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. సిరాజ్ ట్రేడ్‌మార్క్ డెలివరీ వాబుల్ సీమ్‌ను అంచనా వేయలేకపోయిన పోప్ వికెట్ల మందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఇంగ్లండ్ 106 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్రూక్, రూట్ ఇన్నింగ్స్ గతినే మార్చేశారు. వచ్చి రావడంతోనే బ్రూక్..భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటే రూట్ మాత్రం తన శైలికి తగ్గట్లు ఒక్కో పరుగు సాధించుకుంటూ పోయాడు. ఈ క్రమంలో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ప్రసిద్ధ్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద సిరాజ్ చేసిన తప్పు బ్రూక్‌కు లైఫ్ ఇచ్చింది. క్యాచ్ అందుకున్న సిరాజ్ అనుకోకుండా బౌండరీని తాకడంతో బ్రూక్ బతికిపోయాడు. అక్కణ్నుంచి టీమ్ఇండియా బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వని బ్రూక్ 91 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. మరో ఎండ్‌లో రూట్ కూడా జత కలువడంతో ఇంగ్లండ్‌కు పరుగుల రాక సులువైంది. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని ఆకాశ్‌దీప్ విడగొట్టాడు. సిరాజ్ క్యాచ్‌తో బ్రూక్ నాలుగో వికెట్‌గా వెనుదిరుగగా, టీ విరామ సమయానికి ఇంగ్లండ్ 317-4స్కోరుతో నిలిచింది. బ్రేక్ తర్వాత రూట్ 137 బంతుల్లో సెంచరీ చేశాడు. అయితే ప్రసిద్ధ్ వరుస ఓవర్లలో బెతెల్(5)తో పాటు రూట్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వర్షం అంతరాయానికి తోడు వెలుతురు సరిగా లేని కారణంగా నాలుగో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 224 ఆలౌట్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 247 ఆలౌట్,
భారత్ రెండో ఇన్నింగ్స్: 396 ఆలౌట్,
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 339-6(బ్రూక్ 111, రూట్ 105, ప్రసిద్ధ్ 3-109, సిరాజ్ 2-95).