ICC: శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ)కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఒకేరోజు ఓ చేదువార్తతో పాటు మరో శుభవార్త కూడా చెప్పింది. ఇటీవలే లంక బోర్డుపై సస్పెన్షన్ వేటు వేసిన ఐసీసీ.. తాజాగా ఆ క్రికెట్ బోర్డుకు ఊరటనిచ్చింది. వారిపై నిషేధం ఉన్నప్పటికీ లంకేయులు ఎప్పటిలాగే ద్వైపాక్షిక సిరీస్లు, ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనవచ్చని తెలిపింది. అయితే అలా చేయాలంటే తాము సూచించిన నిబంధనలకు లోబడి నడుచుకోవాలని చెప్పింది.
మంగళవారం అహ్మదాబాద్ వేదికగా ముగిసిన బోర్డు సమావేశం అనంతరం ఐసీసీ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఎస్ఎల్సీ నుంచి వచ్చిన ప్రతినిధుల అభ్యర్థనలు విన్న తర్వాత తాము లంక జట్టు మిగతా జట్ల మాదిరిగానే ద్వైపాక్షిక సిరీస్లు, ఐసీసీ టోర్నీలు ఆడొచ్చని తెలిపింది. అయితే ఎస్ఎల్సీకి వచ్చే నిధులపై ఐసీసీ నియంత్రణ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ జోక్యం కూడా ఉండకూడదని ఎస్ఎల్సీకి తేల్చి చెప్పింది. తాజా నిర్ణయంతో లంకేయులు ఊపిరి పీల్చుకున్నారు.
ICC confirms Sri Lanka can play in bilateral and ICC events.
– The funding of SLC will be controlled by the ICC. pic.twitter.com/jnUzzUksz2
— Johns. (@CricCrazyJohns) November 21, 2023
ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్లో ఘోర వైఫల్యం, భారత్ చేతిలో 302 పరుగులు తేడాతో ఓడిన తర్వాత లంక క్రీడా మంత్రి బోర్డు సభ్యులందరిపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఇది జరిగిన కొద్దిరోజులకే ఐసీసీ.. లంక బోర్డు సభ్యత్వాన్ని సస్పెండ్ చేసింది. అయితే మెంబర్షిప్ పునరుద్ధరించినా వచ్చే ఏడాది ఆ దేశంలో జరగాల్సి ఉన్న ఐసీసీ అండర్ – 19 వరల్డ్ కప్ మాత్రం లంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది.