Aman Sehrawat | పారిస్: ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో భారత మల్లయోధుల పతక హవా దిగ్విజయంగా కొనసాగుతున్నది. 1952లో కేడీ జాదవ్ చారిత్రక కాంస్యంతో మొదలైన రెజ్లింగ్ పతక ప్రస్థానం కొత్త పుంతలు తొక్కుతున్నది. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పసిడి పతక ఆశలు ఆవిరైన వేళ తాను ఉన్నానంటూ యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ చిరుతలా దూసుకొచ్చాడు. జపాన్ రెజ్లర్ చేతిలో సెమీస్‌లో ఓడిన అమన్..కాంస్య పతక పోరులో బెబ్బులిలా విరుచుకుపడ్డాడు. పూర్టోరికో రెజ్లర్ క్రజ్ డెరియన్కు చుక్కలు చూపిస్తూ వరుస రౌండ్లలో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆదిలో నెమ్మదించినా..పట్టు బిగించిన తర్వాత ప్రత్యర్థిని మెలికలు తిప్పుతూ వరుస పాయింట్లు కొల్లగొట్టాడు. డెరియన్ పుంజుకునేందుకు ఏ మాత్రం అవకాశమివ్వని అమన్..అతి పిన్న వయసులో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తద్వారా పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించి ఔరా అనిపించాడు. అమన్ కాంస్య పతకంతో వరుసగా ఐదు ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకాలు మనకు దాసోహమయ్యాయి.
భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ దేశానికి ఆరో పతకాన్ని అందించాడు. మహిళల విభాగంలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ అసమాన పోరాటంతో స్వర్ణం లేదా రజతం ఖాయం చేసినా ఫైనల్ పోరుకు కొన్నిగంటల ముందు ఆమె నిర్దేశిత బరువు కంటే వంద గ్రాములు అధికంగా ఉందని ‘అనర్హత వేటు’ ఎదుర్కోవడంతో ఈ క్రీడలో పతకంపై ఆశలు అడుగంటిన వేళ అమన్ మాత్రం ఆ లోటును తన పతకంతో పూరించాడు. పురుషుల 57 కిలోల ఫ్రీ స్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన అమన్ సెమీస్‌లో ఓడినా కాంస్య పోరులో మాత్రం అదరహో అనిపించాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో అమన్ 13-5తో క్రజ్ డెరియన్ (పూర్టోరికో)ను ఓడించి కంచు మోత మోగించాడు. రెజ్లింగ్‌లో భారత్‌కు పారిస్‌లో ఇదే తొలి పతకం కాగా మొత్తంగా ఆరోవది. వినేశ్ పతకం విషయంలో నిరాశగా ఉన్న భారత క్రీడాభిమానులకు అమన్ కాంస్యం కాస్త స్వాంతన కలిగించేదే. అతడు తెచ్చింది కాంస్యమే అయినా ప్రస్తుత పరిస్థితులలో అది పసిడి కంటే ఎన్నో రెట్లు విలువైనది.
ప్రణాళికతో ‘పట్టు’బట్టి..
సెమీస్‌లో జపాన్ రెజ్లర్ హిగూచి చేతిలో ఓడిన అమన్ కాంస్య పోరుకు మాత్రం పక్కా ప్రణాళికతో వచ్చాడు. ప్రత్యర్థిపై ఆది నుంచే ఎదురుదాడికి దిగాడు. అవతలి వైపు క్రజ్ కూడా దూకుడు చూపించడంతో పోరు కాస్తా హోరాహోరీ అయింది. తొలి బౌట్ ఆరంభమైన కొద్దిసేపటికే అమన్‌ను కిందకు పడగొట్టి తొలి పాయింట్ దక్కించుకున్న క్రజ్‌కు ఆ తర్వాత భారత రెజ్లర్ చుక్కలు చూపించాడు. క్రూజ్ కాళ్లను మెలేసి పదే పదే కింద పడగొడుతూ పాయింట్లు రాబట్టాడు. మొదటి రౌండ్ ముగిసేసరికి 6-3 ఆధిక్యంలో ఉన్న అతడు.. రెండో రౌండ్లో దూకుడును మరింత తీవ్రతరం చేశాడు. ముక్కుపై గాయమై రక్తపు చుక్కలు కారుతున్నా వెరువకుండా ఆటను కొనసాగించాడు. అమన్ ‘పట్టు’కు తొలి బౌట్లో కాస్త ప్రతిఘటించిన పూర్టోరికో రెజ్లర్ కీలకమైన రెండో రౌండ్లో మాత్రం చేతులెత్తేశాడు. వీలు చిక్కినప్పుడల్లా అతడిని కిందపడేస్తూ పాయింట్లు రాబట్టడమే గాక ప్రత్యర్థిని ఊపిరాడనీయకుండా చేయడంలో అమన్ సఫలీకృతుడయ్యాడు.