భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ తాజా అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. తమ పార్టీలో చేరడం లేదన్న కక్షపూరిత వైఖరితో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దాదాను పదవికి దూరం చేయడంపై తీవ్ర
విమర్శలు ఎదురవుతున్నాయి. కెప్టెన్‌గా, పరిపాలకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న గంగూలీకి బెంగాల్ బాసటగా నిలుస్తున్నది. రెండోసారి పదవి దక్కకుండా చేసిన బీజేపీపై బెంగాలీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటున్న గుజరాత్ అహాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ రాష్ట్ర గౌరవంగా భావించే గంగూలీకి అన్ని వర్గాల వారు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, రచయితలు, విమర్శకులు స్పందించగా తాజాగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బీజేపీపై నిప్పులు చెరిగారు.
దాదా కేవలం బెంగాల్‌కే పరిమితం కాలేదని, అతను దేశ ఆస్తి అన్న దీదీ..మోసపూరిత వైఖరితో బీసీసీఐ నుంచి
తప్పించారని తీవ్ర విమర్శలు చేసింది. హోం మంత్రి తనయుడు అమిత్‌షా తనయుడు జై షా రెండోసారి పదవిలో కొనసాగగా లేనిది గంగూలీ విషయంలో ఎందుకీ వివక్ష అంటూ మమత దెప్పిపొడిచింది. క్రీడల్లోకి రాజకీయాలు తీసుకురావద్దన్న దీదీ..గంగూలీకి ఐసీసీఐ చైర్మన్ పదవికి అవకాశమివ్వాలంటూ ప్రధాని నరేంద్రమోదీని కోరింది. రోజుకో మలుపుతిరుగుతున్న బీసీసీఐ-గంగూలీ వ్యవహారం ఆత్మగౌరవ పోరాటంగా మారుతున్నది. రానున్న రోజుల్లో ఇది ఎటువైపు దారితీస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
నమస్తే తెలంగాణ క్రీడావిభాగం:భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)- సౌరవ్ గంగూలీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతున్నది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే..కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీసీఐని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వస్తున్నది. ఈ క్రమంలో తమ చెప్పుచేతల్లో ఉండటం లేదన్న కారణం ఒకటైతే పార్టీలో చేరేందుకు సుముఖంగా లేడన్న ఉద్దేశంతో గంగూలీని బోర్డుకు దూరం చేసింది బీజేపీ. ఈ క్రమంలో కుట్రలకు తెరతీసింది. తమ అనుకున్న పనిని సాఫీగా కానివ్వడంలో సఫలమైన బీజేపీ గంగూలీని తప్పించిన విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా దాదా సొంత రాష్ట్రం పశ్చిమబెంగాల్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. రెండోసారి పదవిలో కొనసాగేందుకు జై షాకు ఒక న్యాయం..గంగూలీకి వెన్నుపోటా అంటూ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)నేతలు తమదైన రీతిలో బీజేపీని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శలు సంధిస్తున్నారు. ఇన్నాళ్లు తమ అవసరాలకు అనుగుణంగా దాదాను వాడుకున్న బీజేపీ పెద్దలు..రాజకీయాల పట్ల ఆసక్తి కనబర్చడం లేదన్న కారణంతో దాదాపై కత్తికట్టిన విధానాన్ని బెంగాల్ ప్రజలు తీవ్రంగా ఎండగడుతున్నారు.
కక్షపూరిత వైఖరితో బోర్డు అధ్యక్ష పదవి నుంచి దాదాను తప్పించడాన్ని తమ ఆత్మగౌరవానికి అవమానంగా బెంగాలీయులు భావిస్తున్నారు. ఈ క్రమంలో గుజరాత్ ఆధిపత్య భావజాలాన్ని సమిష్టిగా ఎదుర్కోవాలని చూస్తున్నారు. తాము అమితంగా అభిమానించే ‘ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా’కు జరిగిన అవమానాన్ని తమకు జరిగినట్లుగా భావిస్తున్న బెంగాలీయులు అంతే దీటుగా మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇందులో రాజకీయ కుట్ర ఫ్రస్పుటంగా కనిపిస్తున్న నేపథ్యంలో దాదాకు అన్ని వర్గాల నుంచి అనూహ్య మద్దతు లభిస్తున్నది. దాదా కేవలం బెంగాల్‌కే పరిమితం కాదని, అతడు దేశ ఆస్తి అంటూ గళమెత్తుతున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తొలిసారి బీసీసీఐ-గంగూలీ ఉదంతంపై సోమవారం స్పందించారు. బీసీసీఐ నుంచి గంగూలీని తప్పించిన తీరు మోసపూరిత వైఖరి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన దీదీ..ఐసీసీ చైర్మన్ పదవికి పోటీ చేసేలా ప్రధాని నరేంద్రమోదీ చొరవ తీసుకోవాలని కోరింది. రాష్ట్రంలో పర్యటన నిమిత్తం బయల్దేరిన మమత విమానాశ్రయంలో మీడియాతో పలు అంశాలపై మాట్లాడింది.
దాదాకు దీదీ మద్దతు..
బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి దాదాను తప్పించడంపై దీదీ తనదైన శైలిలో విరుచుకుపడింది. ‘సౌరవ్ గంగూలీ కేవలం బెంగాల్‌కే కాదు యావత్ దేశానికి అతను గర్వకారణం. కెప్టెన్‌గా భారత క్రికెట్ జట్టునే కాదు అధ్యక్షుడిగా బీసీసీఐని ముందుండి నడిపించిన వ్యక్తి. పరిపాలకుడిగా సత్తా ఏంటో నిరూపించుకున్న వ్యక్తి గంగూలీ. కానీ ఉన్నఫళంగా బోర్డు అధ్యక్ష పదవి నుంచి గంగూలీని తప్పించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. కార్యదర్శిగా జై షా వరుసగా రెండోసారి కొనసాగేందుకు లేని ఇబ్బంది గంగూలీ విషయంలో ఎందుకు వచ్చింది. అసలు దీని వెనుక ఎవరు ఉన్నారన్న నిజానిజాలు బయటికి రావాల్సిన అవసరముంది. గంగూలీకి అన్యాయం జరిగిందని మేము భావిస్తున్నాం. ప్రపంచంలో క్రికెట్ ఆడే ప్రతీ దేశానికి అతను ఎవరో తెలుసు. అలాంటి క్రికెటర్‌ను బోర్డు నుంచి తప్పించడాన్ని అవమానంగా భావిస్తున్నాం. ఐసీసీ చైర్మన్ పదవికి గంగూలీ పోటీచేసేందుకు కేంద్రం సహకరించాలి. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ కలుగజేసుకోవాలని నేను కోరుతున్నాను. గంగూలీ ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని రాజకీయం చేయడం ఏమాత్రం మంచిది కాదు’ అని మమత పేర్కొంది.