హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో అఖిల భారత ప్రజా రవాణా సంస్థ కబడ్డీ టోర్నీ గురువారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే టోర్నీని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ ఆర్టీయూ) కబడ్డీ టోర్నీలో ఆతిథ్య తెలంగాణ, మహారాష్ట్ర జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఆటల వల్ల శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. కబడ్డీ టోర్నీ ప్రారంభ కార్యక్రమంలో ఏఎస్ఆర్టీయూ డైరెక్టర్ కిషోర్, టీఎస్ఆర్టీసీ సీవోవో రవిందర్ తదితరులు పాల్గొన్నారు.