Wimbledon : డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) వింబుల్డన్ ఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీఫైనల్లో డానిల్ మెద్వెదేవ్ (Daniil Medvedev)ను మట్టి కరిపించి వరుసగా రెండోసారి టైటిల్ వేటకు అడుగు దూరంలో నిలిచాడు. శనివారం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ స్టార్ చాంపియన్ తరహాలో చెలరేగాడు. నాలుగు సెట్లపాటు ఉత్కంఠ రేపిన పోరు జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ఈ స్పెయిన్ యువకెరటం నొవాక్ జకోవిచ్, లొరెంజో ముసెట్టి మ్యాచ్ విజేతను ఢీ కొట్టనున్నాడు.
సెంటర్ కోర్టులో సాగిన పోరులో అల్కరాజ్ తొలి సెట్ కోల్పోయాడు. అయినా నిరుత్సాహపడకుండా రెండో సెట్ నుంచి గేర్ మార్చి ప్రత్యర్థిని హడలెత్తించాడు. రష్యా ఆటగాడైన మెద్వెదేవ్ సైతం గట్టి పోటీనివ్వడంతో మ్యాచ్ నాలుగో సెట్ వరకూ వెళ్లింది.
The winning moment 🤌
Just listen to @carlosalcaraz and the Centre Court crowd erupt 🔊#Wimbledon pic.twitter.com/PczPKRBVa5
— Wimbledon (@Wimbledon) July 12, 2024
చివరకు అల్కరాజ్ 6-7, 6-3, 6-4, 6-4తో గెలుపొంది టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్ పాయింట్ సాధించగానే సింహ గర్జన చేసిన ఈ యంగ్‌స్టర్ రెండో ఏడాది ట్రోఫీని ముద్దాడేందుకు ఆతృతగా ఉన్నాడు.
ప్రపంచ టెన్నిస్‌లో కొత్త స్టార్‌గా దూసుకొచ్చిన అల్కరాజ్కు ఇది నాలుగో గ్రాండ్‌స్లామ్ ఫైనల్. వింబుల్డన్‌లో అతడికి వరుసగా ఇది 13వ విజయం. అంతేకాదు గ్రాండ్‌స్లామ్స్‌లో 13వ విక్టరీ. ఈ ఏడాది అల్కరాజ్ విజయాల సంఖ్య 17-1.