39 ఏండ్ల రోహిత్ 513 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 20,289 పరుగులు, 50 సాధించి జట్టుపై తనదైన ముద్ర వేశాడు. దీర్ఘకాలంగా ఆటగాడిగా, దేశానికి ఎనలేని సేవ చేసిన రోహిత్ తన కెరీర్ ముగింపుపై సొంతంగా నిర్ణయం తీసుకునే హక్కు అతడికి ఉన్నప్పటికీ, జట్టు ప్రయోజనాల దృష్ట్యా సెలక్టర్లు కూడా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే లార్డ్స్ మ్యాచ్ రోహిత్ కెరీర్‌కు విషమ పరీక్షగా మారనుంది.
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టులో మరో కలవరం. గతేడాది ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సమయంలో చూసిన డ్రామాను మించి ఇప్పుడు ఇంగ్లండ్‌లో రచ్చ నడుస్తోంది. తన అద్భుత, అసాధారణ కెరీర్లో లోటుగా ఉన్న వన్డే వరల్డ్‌కప్‌ను అందుకొని ఆటను ముగించాలని ఆశిస్తున్న రోహిత్ శర్మకు ఆ చాన్స్ దక్కేలా లేదు. 2027 వన్డే కప్ ప్రణాళికల్లో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను తెరపైకి తీసుకొచ్చిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. హిట్‌మ్యాన్‌ను జట్టు నుంచి తప్పించాలని డిసైడైనట్టు తెలుస్తోంది.
ప్రస్తుత ఫామ్, వయసును దీనికి కారణంగా చెబుతూ.. జట్టు నుంచి పొమ్మనకుండానే అతనికి పొగబెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతున్న మాజీ కెప్టెన్ రోహిత్, అగార్కర్, గంభీర్ మధ్య పరస్పర నమ్మకం పూర్తిగా లోపించినట్లు తెలుస్తోంది. దాంతో ఆదివారం లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరగబోయే మూడో వన్డే రోహిత్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ సిరీస్ తర్వాత భారత్ స్వదేశంలో సెప్టెంబర్ 27న వెస్టిండీస్‌తో తదుపరి వన్డే ఆడనుంది.
గతంలో ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు రోహిత్, అగార్కర్ మధ్య సత్సంబంధాలు ఉండేవి. ఈ ముగ్గురి కాంబినేషన్లో భారత్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ చేరడమే కాకుండా 2024 టీ20 ప్రపంచకప్ గెలిచింది. కానీ గంభీర్ రాకతో సమీకరణాలు పూర్తిగా మారాయి. నిజానికి ద్రవిడ్ తర్వాత భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ఉండమని గంభీర్‌ను మొదట కోరింది రోహితే కావడం గమనార్హం. అప్పుడు ‘నువ్వు కెప్టెన్‌గా ఉంటేనే నేను కోచ్‌గా వస్తా’ అని రోహిత్‌కు గౌతీ చెప్పాడు.
అదే సమయంలో ద్రవిడ్‌తో పోలిస్తే గౌతీ శైలి పూర్తిగా భిన్నంగా ఉంటుందని, తనతో పని చేయడం అంత సులువు కాబోదని రోహిత్‌కు అతని సన్నిహితులు చెప్పారు. వాళ్ల అంచనా నిజం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడం అతడిని తీవ్ర నిరాశకు గురిచేసింది. సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ (0-3) అయినప్పటి నుంచే రోహిత్, గంభీర్, అగార్కర్ మధ్య విభేదాలు మొదలయ్యాయి. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన సమయానికి మరింత ముదిరాయి.
బోర్డర్-గావస్కర్ ట్రోపీ తర్వాత 2025లో ఇంగ్లండ్ పర్యటనకు టెస్టు టీమ్ ఎంపికలోనూ ఇరువర్గాల మధ్య స్పష్టత లోపించింది. సెలెక్టర్లు టీమ్ నుంచి డ్రాప్ చేస్తామని చెప్పడంతో రోహిత్ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే పరిస్థితి వచ్చిందని అతని సన్నిహిత వర్గాలు చెప్పాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న సెలెక్టర్లు, బోర్డు పెద్దలు తనతో పంచుకున్న 2027 వరల్డ్ కప్ నిర్ణయాలపై రోహిత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. టీమ్ మేనేజ్మెంట్ వ్యవహారశైలి అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది.
రెండో వన్డేలో 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఎప్పుడూ దూకుడుగా ఆడే రోహిత్.. ఈ మ్యాచ్‌లో రక్షణాత్మక ధోరణిలో, తీవ్ర ఆందోళనతో కనిపించాడు. అయితే భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాత్రం రోహిత్‌ను సమర్థించాడు. పిచ్‌పై బౌన్స్ సరిగా లేకపోవడం వల్లే రోహిత్ లయ అందుకోలేకపోయాడని, దానిని ఫామ్ కోల్పోవడం అనలేమని అన్నాడు. లార్డ్స్ వన్డేలో అతడు భిన్నంగా ఆడతాడని ధీమా వ్యక్తం చేశాడు.
చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత రోహిత్ 14 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 45.3 సగటు, 92.03 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీల సాయంతో 589 పరుగులు చేశాడు. ఈ గణాంకాలు అతడి కెరీర్ సగటు (48.58 సగటు, 92.76 స్ట్రైక్ రేట్)కు దగ్గరగానే ఉన్నప్పటికీ, పరుగులు సాధిస్తున్న తీరు మాత్రం ఆందోళన కలిగిస్తోంది. 2023 వన్డే ప్రపంచకప్‌లో 54.27 సగటు, 125.94 భీకర స్ట్రైక్ రేట్‌తో ఆడి భారత్‌ను ఫైనల్‌కు చేర్చిన రోహిత్ మార్క్ దూకుడు ప్రస్తుత ఆటలో కనిపించడం లేదు.
ప్రతి ఇన్నింగ్స్ అతడికి ఒక పరీక్షలా మారడంతో క్రీజులో స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. మరోవైపు, జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఓపెనర్ స్థానం కోసం 24 ఏండ్ల ముంబై యువ సంచలనం యశస్వి జైస్వాల్ వన్డేల్లోనూ తన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. చివరి మూడు వన్డేల్లోనే జైస్వాల్ రెండు శతకాలు బాదాడు. దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసిన రుతురాజ్ కూడా రేసులోకి రావడంతో రోహిత్‌పై ఒత్తిడి పెరిగింది.