ఢిల్లీ: భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ దేశం కోసం (డేవిస్ కప్లో) ఆడేందుకు భారీగా నగదు డిమాండ్ చేశాడని ఆలిండియా టెన్నిస్ సమాఖ్య (ఐటా) సంచలన ఆరోపణలు చేసింది. డేవిస్ కప్ ఆడేందుకు నాగల్తో పాటు యూకీ బాంబ్రీ, శశికుమార్ తిరస్కరించారని, ఈ టోర్నీలో పాల్గొనాలంటే ఏడాదికి తనకు 50 వేల యూఎస్ డాలర్లు (రూ.45 లక్షలు) చెల్లించాలని నాగల్ డిమాండ్ చేసినట్టు ఐటా కార్యదర్శి అనిల్ ధూపర్ వెల్లడించాడు.
‘దేశం తరఫున ఆడేప్పుడు ఒక క్రీడాకారుడు డబ్బులు డిమాండ్ చేయడమేంటి? డేవిస్ కప్లో ఆడాలంటే రూ. 45 లక్షలు ఇస్తేనే ఆడతానని లేకుంటే ఆడనని నాగల్ చెప్పాడు’ అని అన్నాడు. అయితే ఈ ఆరోపణలపై నాగల్ సైతం ఘాటుగానే స్పందించాడు. ‘దేశం తరఫున ఆడినా ప్రొఫెషనల్ క్రీడాకారులకు పరిహారం ఇవ్వడం సర్వసాధారణమే. ఇందులో సొంత ప్రయోజనాలేమీ లేవు’ అని ఎక్స్ ఖాతాలో వివరణ ఇచ్చాడు.