Virat Kohli: హైదరాబాద్ వేదికగా మరో మూడు రోజుల్లో ఉప్పల్ స్టేడియంలో మొదలుకాబోయే ఇండియా – ఇంగ్లండ్ తొలి టెస్టుకు ముందే రోహిత్ శర్మ సేనకు భారీ షాక్ తగిలింది. టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తొలి రెండు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో అతడు హైదరాబాద్, విశాఖపట్నం వేదికగా జరగాల్సి ఉన్న టెస్టులకు దూరంగా ఉండనున్నాడు. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎక్స్ (ట్విటర్) ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది.
ఇదే విషయమై బీసీసీఐ… ‘భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగబోయే తొలి రెండు టెస్టులకు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో అతడు ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నాడు. ఈ విషయాన్ని అతడు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లకూ తెలియజేశాడు. దేశానికి ఆడటం కోహ్లీకి ప్రథమ ప్రాధాన్యమైనా కొన్ని వ్యక్తిగత కారణాలతో అతడు రెండు టెస్టులకు దూరమవుతున్నాడు. బీసీసీఐ అతడి నిర్ణయాన్ని గౌరవిస్తుంది. మీడియా, ఫ్యాన్స్ అందరూ కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించి అతడి గోప్యతను గౌరవించాలి. కోహ్లీ రిప్లేస్మెంట్ను త్వరలోనే ప్రకటిస్తాం’ అని ప్రకటనలో పేర్కొంది.
🚨 NEWS 🚨
Virat Kohli withdraws from first two Tests against England citing personal reasons.
Details 🔽 #TeamIndia | #INDvENGhttps://t.co/q1YfOczwWJ
— BCCI (@BCCI) January 22, 2024
కోహ్లీ భార్య అనుష్క శర్మ గర్భవతి. త్వరలోనే ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వనుందని సమాచారం. కోహ్లీ ఇదే కారణంతో తొలి రెండు టెస్టులకు దూరమయ్యాడని తెలుస్తున్నది. అయితే దీనిపై బీసీసీఐతో పాటు విరాట్ ఫ్యామిలీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ కోహ్లీ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ షాక్ తగిలినట్టైంది. జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్ (ఉప్పల్) వేదికగా తొలి టెస్టు జరగాల్సి ఉండగా.. ఫిబ్రవరి 02 నుంచి 06 దాకా విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు జరుగనుంది.