Aman Preet Singh | హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగుతోంది. ఈ కేసులో ప్రముఖ సినీ నటి (Rakul Preeth Singh) సోదరుడు అమన్‌ప్రీత్ సింగ్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. మాసాబ్‌ట్యాంక్ పరిధిలో నమోదైన డ్రగ్స్ కేసులో అమన్‌ప్రీత్ సింగ్‌ని నిందితుడిగా తేల్చారు. ప్రస్తుతం అతను పరారీలో ఉండటంతో, పట్టుకోవడానికి ఈగల్ టీమ్ మరియు స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఇటీవల ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వి అనే ఇద్దరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా అమన్‌ప్రీత్ పేరు వెలుగులోకి వచ్చింది. నిందితుల నుంచి పోలీసులు 43 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అంతేగాకుండా పట్టుబడిన వ్యాపారుల వద్ద నుంచి అమన్‌ప్రీత్ క్రమం తప్పకుండా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు ఈగల్ టీమ్ ఆధారాలు సేకరించింది. మరోవైపు అమన్‌ప్రీత్‌కు డ్రగ్స్ కేసుల్లో పాత నేరచరిత్ర ఉంది. గత ఏడాది కూడా సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్ వినియోగిస్తూ పోలీసులకు పట్టుబడ్డట్లు సమాచారం. ఈ కేసులో మరికొంత మంది ప్రముఖుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమన్‌ప్రీత్ దొరికితే ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది.