Egg Yolk | మన శరీరానికి కావల్సిన పోషకాలను అందించే ఆహారాల్లో కోడిగుడ్లు కూడా ఒకటి. కోడిగుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ ఎ, డి, ఇ, కె లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. వీటితో రకరకాల వంటకాలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాం. ముఖ్యంగా గుడ్డును ఉడికించి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే మనలో చాలా మందికి గుడ్డులోని పచ్చసొనను తీసుకోవాలా వద్దా అనే సందేహం ఉంటుంది. తెల్లసొనలో లాగా పచ్చసొనలో కూడా అనేక రకాల పోషకాలు ఉంటాయి. పచ్చసొనను తీసుకోవడం వల్ల మన శరీరానికి మరింత మేలు కలుగుతుంది. గుడ్డులోని పచ్చసొనను తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు.
గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ ఎ, డి, ఇ వంటి పోషకాలు ఉంటాయి. సెలీనియంతో పాటు ఇతర ఖనిజాలు ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాల లోపం తలెత్తకుండా ఉంటుంది. గుడ్డులోని పచ్చసొనలో కోలిన్ ఉంటుంది. ఇది మెదడు అభివృద్దికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. పచ్చసొనలో లుటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. తద్వారా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. ఇక దీనిలో నాణ్యమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరానికి కావల్సిన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. గుడ్డులోని పచ్చసొనను తీసుకోవడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. పచ్చసొనలో ఉండే విటమిన్ డి క్యాల్షియం శోషణలో సహాయపడుతుంది. దీంతో ఎముకలు ధృడంగా తయారవుతాయి.
గుడ్డులోని పచ్చసొనలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని రక్షించడంలో వృద్దాప్య ఛాయలను తగ్గించడంలో దోహదపడతాయి. ఈవిధంగా గుడ్డులోని పచ్చసొనను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే పచ్చసొన ఆరోగ్యకరమే అయినప్పటికి దీనిని తీసుకోవడం వల్ల మనం కొన్ని దుష్పభ్రావాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులు వంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే గుడ్డులోని పచ్చసొన కొందరిలో అలర్జీకి కూడా దారి తీస్తుంది. ఇక పూర్తిగా ఉడకని పచ్చసొనలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది. సరిగ్గా ఉడికించని పచ్చసొనను తీసుకోవడం వల్ల అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. కనుక బరువు తగ్గాలనుకునే వారు దీనిని తీసుకోకపోవడమే మంచిది.
గుడ్డులోని పచ్చసొన మన ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ గుండె జబ్బులు, అధిక బరువు, అధికంగా కొలెస్ట్రాల్ స్థాయిలు కలిగి ఉన్నవారు, వ్యాయామం చేయని వారు దీనిని తీసుకోకపోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. ఇక శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారు, ఎదిగే పిల్లలు, గర్భిణీలు దీనిని వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. కనుక మనం చేసే పనిని బట్టి, మన ఆరోగ్యానికి అనుగుణంగా గుడ్డులోని పచ్చసొనను తీసుకోవడం మంచిది.