HCA | హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో జరుగుతున్న సెలెక్షన్స్‌లో అవకతవకలపై భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి ఆందోళనకు దిగారు. జిల్లాల నుంచి ప్లేయర్లకు సరైన ప్రాతినిధ్యం లేదంటూ తనకు ఫిర్యాదులు వచ్చాయని ఆయన అన్నారు. ఈ క్రమంలో బుధవారం ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ కార్యదర్శి దేవరాజ్‌ను ఎంపీ కలిశారు. ఈ సందర్భంగా సెలెక్షన్స్‌లో చోటు చేసుకుంటున్న అవకతవకలను వివరిస్తూ, హెచ్‌సీఏ ప్రక్షాళన చేయాలని సూచించారు. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తానని ఎంపీ హెచ్చరించారు.
క్రీడాకారుల ఎంపిక అనేది పారదర్శకంగా ఉండాలి. ప్రతిభ ఉన్నవారికే అవకాశం దక్కాలి. అయితే క్రికెట్లో పరిస్థితులు భిన్నంగా ఉంటున్నాయి. ప్రతిభ ఉన్నవారిని కాదని.. తమ వారిని పోటీలకు ఎంపిక చేయాలన్న ఒత్తిడి సెలక్షన్ కమిటీపై పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాత్ర క్రీడాకారుల ఎంపికలో కీలకంగా ఉండడంతో అనేక మంది హెచ్‌సీఏపై ఒత్తిడి పెంచుతున్నారు. అండర్-16, అండర్-19 సెలెక్షన్లలో తమవారిని ఏదో ఒక పొజిషన్లో ఆడించాలని, ఒక్క చాన్స్ అయినా ఇవ్వాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఇటీవల రాష్ట్రంలోని ఓ కీలక పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ఎంపీ తన బామ్మర్ది కొడుకు కోసం(మేనల్లుడు) విపరీతంగా పైరవీలు చేశాడు. హెచ్‌సీఏ తన మాట వినకపోవడంతో ఆయన ఏకంగా హెచ్‌సీఏపై లేఖల యుద్ధం చేశాడు. ఫిర్యాదులు చేస్తానని బెదిరించినట్టు తెల్సింది. చివరకు మొత్తం సెలక్షన్ విధానమే లోపభూయిష్టమని, ఇది జరగాల్సిన పద్ధతి ఇది కాదని, అక్రమాలు జరిగాయని కూడా ఆరోపిస్తూ కొంత మందితో ఆందోళన జరిపించేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. ప్రజాప్రతినిధులు తమపై ఇలా ఒత్తిడి తెస్తే ఇక ప్రతిభ ఉన్న ప్లేయర్లను ఎలా ఎంపిక చేసేదని హెచ్‌సీఏ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.