గతేడాది దుబాయ్ వేదికగా ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత భారత జట్టు వైఖరి, ఆట ఆడే విధానంలో మార్పు వచ్చిందా..? అంటే అవుననే అంటున్నాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ. ఆసియా కప్‌తో పాటు మరో రెండు నెలల్లో ఆసీస్ వేదికగా పొట్టి ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో రోహిత్.. జట్టు వైఖరి, సారథుల మార్పు, ఆట ఆడే విధానంలో మార్పునకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో హిట్‌మ్యాన్ మాట్లాడుతూ.. ‘గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత మేం జట్టులో ఉన్న ఆటగాళ్లందరికీ స్పష్టమైన సందేశం ఇచ్చాం. ఆ టోర్నీలో మేం ఫైనల్స్‌కు వెళ్లలేదు. దీనికి కారణం మేం ఆడే వైఖరి, ఆడాల్సిన విధానం. దానిని మార్చుకోవాలని నిశ్చయించుకున్నాం. ఇప్పుడు అదే విధానాన్ని అనుసరిస్తున్నాం..
జట్టు ఎక్కడ ఉండాలనే విషయమై ఆటగాళ్లకు కెప్టెన్, హెడ్ కోచ్ నుంచి స్పష్టమైన సందేశం ఉంటే వ్యక్తిగతంగా వాళ్లు కర్తవ్యాలను తూచా తప్పకుండా నిర్వహిస్తారు. అందుకోసం వాళ్లకు కావల్సినంత స్వేచ్ఛ, స్పష్టత కావాలి. ఇప్పుడు మేం ఆ స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం..’ అని అన్నాడు.
ఇక జట్టులో ఎక్కువ మంది సారథులను మార్చడంపై రోహిత్ స్పందిస్తూ.. ‘అలాంటి నాయకత్వం జట్టు కలిగి ఉండటం మంచిదని నా భావన. మేం ఐపీఎల్ ఆడతాం. అక్కడ పది జట్లు ఉన్నాయి. పది మంది సారథులుంటారు. వాళ్లు (ఇండియా క్రికెటర్లు అయితే) ఏదో ఒక దశలో జాతీయ జట్టులో కూడా భాగమవుతారు. మాకు ఒత్తిడిని అధిగమించే ఆటగాళ్లు కావాలి. పరిస్థితులను అర్థం చేసుకుని అందుకు తగ్గట్టుగా ఆడాలి. జట్టుకు సారథిగా ఉండే క్రమంలో ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు నా పని కూడా తగ్గుతుంది..’అని చెప్పాడు.