న్యూఢిల్లీ: ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) ఇటీవల కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. అయితే అనేక కేసుల్లో కోర్టు చుట్టూ తిరుగుతున్న లాలూ .. చాన్నాళ్ల తర్వాత మళ్లీ బ్యాడ్మింటన్ ఆడారు. లాలూ షటిల్ ఆడుతున్న వీడియోను ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఆ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్‌లో పాత హిందీ సాంగ్ కూడా ప్లే అవుతోంది. లాలూ ఓ స్మాష్ షాట్ కూడా ఆడారు. తన తండ్రి లాలూ ధీరుడని, పోరాడుతారని, జైలు గురించి భయపడరని, చివరకు అన్నింట్లో గెలుస్తారని తేజస్వి తన పోస్టుకు కామెంట్ చేశారు.
గడిచిన ఏడు నెలల నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్‌కు వెళ్లలేదు. ఆయన గత ఏడాది సింగపూర్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. డిసెంబర్లో కిడ్నీ మార్పిడి జరగ్గా.. ఆయన ఫిబ్రవరిలో ఇండియాకు వచ్చారు. 75 ఏళ్ల లాలూకు డిసెంబర్ 5వ తేదీన ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది. దాణా కుంభకోణాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన .. ప్రస్తుతం మెడికల్ గ్రౌండ్స్‌తో బెయిల్‌పై ఉన్నారు.