Nepal Cricket: ప్రపంచ క్రికెట్లో పెద్దన్నగా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి అంతర్జాతీయ క్రికెట్లో ఓనమాలు నేర్చుకుంటున్న దేశానికి అండగా నిలువబోతున్నది. యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న తమ దేశ క్రికెటర్లకు సాయం అందించాలని వచ్చిన అఫ్గానిస్తాన్ క్రికెట్‌కు ఊతమిచ్చిన బీసీసీఐ.. తాజాగా మరో పొరుగు దేశానికి సాయం చేయబోతున్నది. హిమాలయ సానువుల్లో ఉన్న దేశం నేపాల్‌కు బీసీసీఐ ఊతమందించనుంది. నేపాల్ క్రికెట్ జట్టుకు శిక్షణ, మౌళిక వసతుల కల్పన, బెంగళూరులో ఆటగాళ్లకు అవసరమైన వైద్య సదుపాయాలు అందించేందుకు బీసీసీఐ ముందుకొచ్చింది. ఈ మేరకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ (క్యాన్) అధ్యక్షుడు చతుర్ బహదూర్.. శుక్రవారం బీసీసీఐ కార్యదర్శి జై షాను ఢిల్లీలో కలిసి కీలక విషయాలు చర్చించినట్టు సమాచారం.
ఈ ఏడాది అమెరికా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో నేపాల్ క్రికెట్ జట్టుకు ఢిల్లీలో శిక్షణ ఇప్పించాల్సిందిగా చతుర్.. జై షాను కోరినట్టు తెలుస్తోంది. ఇందుకు జై షా కూడా సానుకూలంగానే స్పందించినట్టు సమాచారం. అయితే నేపాల్ క్రికెట్‌కు ఏ ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటన్నింటిపై తమకు సమగ్ర వివరాలు అందిస్తే దానిపై బీసీసీఐలో చర్చించి చెబుతామని బహదూర్‌కు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం నేపాల్‌లో వాతావరణం క్రికెటర్ల ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేదు. అదీగాక అక్కడ స్టేడియాలలో మౌళిక సదుపాయాలు అరకొరగానే ఉన్నాయి. దీంతో వరల్డ్ కప్‌కు ప్రిపేర్ అవడం ఇప్పుడు నేపాల్ క్రికెటర్లకు శక్తికి మించిన పనే. అదీగాక సరైన శిక్షణ లేక నేపాల్ అంతర్జాతీయ క్రికెట్లో వరుస పరాజయాలను చవిచూస్తున్నది. అయితే టీ20 వరల్డ్ కప్ నాటికి చిన్న చిన్న సమస్యలను అధిగమించాలని క్యాన్ భావిస్తోంది. అన్నీ కుదిరితే ఫిబ్రవరిలో నేపాల్ జాతీయ జట్టుతో పాటు అండర్ – 19 జట్లు ఢిల్లీలో శిక్షణ పొందుతాయి. గతంలో బీసీసీఐ.. అఫ్గానిస్తాన్ క్రికెటర్లకు ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో ఉన్న స్టేడియాలలో ప్రత్యేక శిక్షణ ఇప్పించడమే గాక ఆ దేశం అంతర్జాతీయ మ్యాచ్‌లకూ కూడా వేదిక అయింది. నేడు అఫ్గాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో సాధిస్తున్న విజయాలలో బీసీసీఐ పాత్ర కీలకమన్నది జగద్విదితం.