Kagiso Rabada | దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయర్ కగిసో రబాడా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్లో రబాడా అర్ధాంతరంగా స్వదేశానికి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వ్యక్తిగత కారణాలతోనే స్వదేశానికి వెళ్లినట్లు అప్పట్లో గుజరాత్ టైటాన్స్ వెల్లడించింది. తాజాగా ఐపీఎల్‌కు దూరం కావడానికి కారణమేంటో రబాడా వెల్లడించారు. నిషేధిత ఉత్ప్రేరకం (రిక్రియేషనల్ డ్రగ్) సేవరించినట్లు నిర్ధారణ కావడంతోనే స్వదేశానికి వెళ్లాల్సి వచ్చిందని ప్రకటించారు. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెటర్ల సంఘం (SACA) శనివారం ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 3న రబాడ కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాడు. వ్యక్తిగత కారణాలతోనే స్వదేశానికి వెళ్లినట్లు ఆ సమయంలో గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం తెలిపింది.
అయితే, తాజాగా రబాడ విడుదల చేసిన ప్రకటనతో అసలు విషయం బయటకు వచ్చింది. నిషేధిత ఉత్ప్రేరకం సేవించినట్లుగా తేలడంతో తాత్కాలిక నిషేధానికి గురైనట్లు పేర్కొన్నారు. అందుకే దక్షిణాఫ్రికాకు తిరిగి రావాల్సి వచ్చిందని చెప్పాడు. దీనికి ఎంతో చింతిస్తున్నానని.. తన కారణంగా నిరాశ చెందిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెబుతున్నట్లుగా చెప్పాడు. క్రికెట్ ఆడడం తనకు దక్కిన గౌరవమని, దాన్ని ఎప్పటికీ తక్కువగా చూడనని పేర్కొన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వారికి రబాడ కృతజ్ఞతలు తెలిపాడు. సౌతాఫ్రికా క్రికెట్ అసోసియేషన్, గుజరాత్ టైటాన్స్ యాజమ్యానికి ధన్యవాదాలు చెప్పాడు. ఇదిలా ఉండగా ఈ సారి ఐపీఎల్లో రెండు మ్యాచులు ఆడిన రబాడా.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 41 పరుగులు ఇచ్చి ఒకే వికెట్ పడగొట్టాడు. ముంబయితో మ్యాచ్‌లో 42 పరుగులు ఇచ్చి.. ఒక వికెట్ పడగొట్టాడు.