పుణె: గత మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న అఫ్గానిస్థాన్ జట్టు.. మరో పోరుకు సిద్ధమైంది. సోమవారం పుణె వేదికగా శ్రీలంకతో అఫ్గాన్ అమీతుమీ తేల్చుకోనుంది. పాక్‌ను స్పిన్ ఉచ్చులో బిగించి ఉక్కిరి బిక్కిరి చేసిన అఫ్గాన్.. అదే జోరు కొనసాగించాలని చూస్తుంటే.. సెమీస్ రేసును రసవత్తరం చేయాలని శ్రీలంక కాచుకొని కూర్చుంది. అయితే గాయాలు లంకను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.
టోర్నీకి ముందే వణిండు హసరంగ దూరం కాగా.. ఆ తర్వాత కెప్టెన్ షనక వరల్డ్‌కప్ నుంచి వెనుదిరిగాడు. తాజాగా ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డ పేస్ బౌలర్ లహిరు కుమార ప్రపంచకప్ నుంచి తప్పుకోగా.. అతడి స్థానంలో దుష్మంత చమీర టీమ్‌లోకి వచ్చాడు. ఇరు జట్లు వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు ఐదేసి మ్యాచ్‌లు ఆడి రెండేసి విజయాలతో చెరో నాలుగు పాయింట్లు ఖాతాలో వేసుకున్న నేపథ్యంలో ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.