AFG vs NZ | ఢిల్లీ: అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఢిల్లీకి సమీపంలో ఉన్న నోయిడాలో నిర్వహించతలపెట్టిన ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు (?) దిశగా సాగుతోంది. ఈ నెల 9 నుంచి 13 మధ్య నోయిడాలోని షాహీద్ విజయ్ సింగ్ పతీక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఈ టెస్టు జరగాల్సి ఉండగా మ్యాచ్ మొదలై రెండు రోజులైనప్పటికీ ఆటలో ఒక్క బంతి కూడా పడలేదు.
ప్రస్తుతం నోయిడాలో వర్షాలు లేకున్నా గత వారం కురిసిన వానల కారణంగా స్టేడియంలో ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. ఈ స్టేడియంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ లేనందున ఔట్ ఫీల్డ్ ఆరక రెండ్రోజులుగా మ్యాచ్ సాగకపోవడం ఇరు జట్ల ఆటగాళ్లతో పాటు అభిమానులనూ నిరాశకు గురిచేస్తోంది. మూడో రోజూ ఇక్కడ మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేయడంతో పాటు ఇక నోయిడాలో అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించకుండా ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఐసీసీ మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ వేదిక భవిష్యత్ ఆధారపడి ఉంది.
అఫ్గానిస్థాన్‌లో క్రికెట్ మ్యాచ్‌లను నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు.. బీసీసీఐని సంప్రదించడంతో బోర్డు మూడు వేదికలను సూచించింది. నోయిడాతో పాటు బెంగళూరులోని చిన్నస్వామి, కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియాలను సూచించినా అఫ్గాన్ మాత్రం గతంలో తాము ఆడిన నోయిడానే ఎంచుకుంది. సదుపాయాల కొరతతో పాటు ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో బీసీసీఐ ఇక్కడ దేశవాళీ మ్యాచ్‌ల నిర్వహణను 2019 నుంచే నిలిపేసింది. కాగా నోయిడాలో ఔట్ ఫీల్డ్‌ను ఆరబెట్టేందుకు అక్కడి సిబ్బంది ఉపయోగిస్తున్న ఫ్యాన్లు, గడ్డిని తవ్వుతూ ఆరబెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదీగాక ఇక్కడి క్యాటరింగ్ సిబ్బంది భోజనానికి ఉపయోగించే పాత్రలను టాయ్లెట్లలో కడుగుతున్న దృశ్యాలూ నెట్టింట వైరల్ అవడంతో నెటిజన్లు బీసీసీఐపై నిందలేస్తున్నారు. అయితే మ్యాచ్‌తో తమకేమీ సంబం ధం లేదని బీసీసీఐ ప్రతినిధి ఒకరు చెప్పారు.