ODI World Cup 2023 | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. తాజా టోర్నీలో ముగ్గురు మాజీ చాంపియన్లను మట్టికరిపించిన అఫ్గాన్.. నెదర్లాండ్స్‌ను చిత్తుచేసి హ్యాట్రిక్ కొట్టింది. మొదట స్పిన్నర్ల ముప్పెట దాడికి తోడు అనవసర రనౌట్లు డచ్ జట్టును నిండా ముంచితే.. ఆనక అఫ్గాన్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడి జట్టును గెలిపించారు. ఈ దెబ్బతో అఫ్గాన్ సెమీస్ అవకాశాలు మెరుగవగా.. నాకౌట్ బెర్త్‌పై భారీ ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్ సంకట స్థితిలో పడింది!
లక్నో: స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై సమిష్టిగా సత్తాచాటిన అఫ్గానిస్థాన్ వన్డే ప్రపంచకప్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో అఫ్గాన్ 7 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తుచేసింది. ఏడు మ్యాచ్‌ల్లో అఫ్గాన్‌కు ఇది నాలుగో విజయం కాగా.. 8 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పాకిస్థాన్ (7 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో 6 పాయింట్లు)ను వెనక్కి నెట్టి పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది. మరోవైపు ఏడు మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ ఐదో పరాజయం మూటగట్టుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ 46.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. ఇంగిల్బెర్త్ (58; 6 ఫోర్లు), మ్యాక్స్ ఓ డౌడ్ (42; 9 ఫోర్లు) రాణించారు. ఒక దశలో 73 పరుగులకు ఒకే వికెట్ మాత్రమే కోల్పోయి పటిష్ట స్థితిలో కనిపించిన డచ్ జట్టును.. రనౌట్లు దెబ్బకొట్టాయి.
లక్నో పిచ్ స్పిన్‌కు సహకరిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ నలుగురు స్పిన్నర్లను బరిలోకి దింపింది. నబీ మూడు వికెట్లు పడగొట్టగా.. నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీశాడు. టాప్-5లో నలుగురు బ్యాటర్లు రనౌట్ కావడం డచ్ జట్టు కొంపముంచింది. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో అఫ్గానిస్థాన్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిది (56 నాటౌట్; 6 ఫోర్లు), రహ్మత్ షా (52; 8 ఫోర్లు), అజ్మతుల్లా ఒమర్జాయ్ (31 నాటౌట్) సత్తాచాటారు. మరో 111 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించిన అఫ్గాన్ రన్‌రేట్ మెరుగుపరుచుకోవడంతో పాటు.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి తొలిసారి అర్హత సాధించింది. నబీకి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ప్రపంచకప్‌లో ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో నాలుగింట విజయాలు సాధించిన అఫ్గానిస్థాన్.. సెమీఫైనల్‌కు చేరాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాపై విజయాలు సాధించాలి. అదే జరిగితే అఫ్గాన్ 12 పాయింట్లతో ముందంజ వేస్తుంది. ఒకవేళ ఓడినా అవకాశం ఉన్నా అది మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. ఎటొచ్చి నెదర్లాండ్స్‌పై అఫ్గాన్ విజయం పాకిస్థాన్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసింది. ఇప్పుడా జట్టు ముందంజ వేయాలంటే అద్భుతం జరగాల్సిందే.
సెమీఫైనల్ చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. అది జరిగితే మా దేశ క్రికెట్లో గొప్ప ఘనత సాధించినట్లు అవుతుంది. మూడు నెలల క్రితం మా అమ్మ చనిపోయింది. ఆ బాధను దిగమింగి వరల్డ్‌కప్ ఆడుతున్నా. మా దేశంలో చాలా మంది పరిస్థితి ఇంతకన్నా ఘోరంగా ఉంది. వారందరికీ ఈ విజయాన్ని అంకితమిస్తున్నాం. వరుసగా మూడో మ్యాచ్‌లో విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించడం ఆనందంగా ఉంది. నబీ స్పెషల్ ప్లేయర్. జట్టుకు అవసరమైన సమయంలో నేనున్నానంటూ బాధ్యత భుజానెత్తుకుంటాడు.
-హష్మతుల్లా షాహిది, అఫ్గానిస్థాన్ కెప్టెన్
ప్రపంచకప్‌లో తొలి 17 మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయమే నమోదు చేసుకున్న అఫ్గానిస్థాన్.. చివరి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలుపొందింది.
నెదర్లాండ్స్: 46.3 ఓవర్లలో 179 (ఇంగిల్బెర్త్ 58; మ్యాక్స్ ఓ డౌడ్ 42; నబీ 3/28, నూర్ అహ్మద్ 2/31), అఫ్గానిస్థాన్: 31.3 ఓవర్లలో 181/3 (హష్మతుల్లా 56, రహ్మత్ షా 52; సాఖిబ్ 1/25).