Champions Trophy 2025 : వరల్డ్ కప్ అద్భుత విజయాలతో అదరగొడుతున్న అఫ్గనిస్థాన్(Afghanistan) జట్టు చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మకమైన చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి తొలిసారి అర్హత సాధించింది. సోమవారం శ్రీలంకపై బంగ్లాదేశ్ గెలుపొందడంతో అఫ్గన్ జట్టు క్వాలిఫై అయింది.
వరల్డ్ కప్ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచిన హష్మతుల్లా షాహిదీ బృందం.. 2025 జరుగనున్నచాంపియన్స్ ట్రోఫీ బెర్తు దక్కించుకుంది. వరల్డ్ కప్‌లో టాప్-7లో నిలిచిన జట్లు నేరుగా క్వాలిఫై అవుతాయి. ఈ మెగా టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.
అఫ్గనిస్థాన్ జట్టు
పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అఫ్గానిస్థాన్.. గత ప్రపంచ కప్ టోర్నీల్లో రెండంటే రెండు విజయాలకే పరిమితమైంది. అయితే.. ఈసారి బలమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో ప్రత్యర్థులకు షాకిస్తోంది. రషీద్ ఖాన్, రెహ్మాన్, నబీ స్పిన్ త్రయం స్టార్ ఆటగాళ్లను సైతం ముప్పతిప్పలు పెడుతోంది.
లక్ష్య ఛేదనలో ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, జర్డాన్, అజ్మతుల్లా దంచికొడుతూ జట్టును గెలుపుబాట పట్టిస్తున్నారు. దాంతో.. మాజీ చాంపియన్లు ఇంగ్లండ్‌కు షాకిచ్చిన కాబూలీ టీమ్ ఆ తర్వాత వరుసగా శ్రీలంక, పాకిస్థాన్ జట్లను మట్టికరిపించింది. ప్రస్తుతం 8 పాయింట్లతో సెమీస్ రేసులో నిలిచిన హష్మతుల్లా బృందం.. చావోరేవో మ్యాచ్‌లో ముంబైలో నవంబర్ 7న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 10 పాయింట్లతో ఐదో స్థానానికి చేరుతుంది.