అబుదాబి : ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్ బోణీ కొట్టింది. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా గ్రూప్-బీలో పసికూన హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్.. 94 పరుగుల తేడాతో గెలిచి టోర్నీని విజయంతో ఆరంభించింది. యూఏఈలో ఇటీవలే పాక్‌తో ముగిసిన ముక్కోణపు టీ20 సిరీస్ ఫైనల్లో బ్యాటింగ్ వైఫల్యంతో దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్న ఆ జట్టు.. ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో మాత్రం రెచ్చిపోయింది. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రషీద్ ఖాన్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఓపెనర్ సెదికుల్లా అటల్ (52 బంతుల్లో 73 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఆల్‌రౌండర్ అజ్మతుల్లా (21 బంతుల్లో 53, 2 ఫోర్లు,5 సిక్స్‌లు) అర్ధ శతకాలతో కదం తొక్కారు. హాంకాంగ్ బౌలర్లలో కించిత్ షా (2/24) ఫర్వాలేదనిపించాడు. అనంతరం భారీ ఛేదనలో హాంకాంగ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 94 పరుగులే చేయగలిగింది. బాబర్ హయాత్ (43 బంతుల్లో 39, 3 సిక్స్‌లు) ఒక్కడే పోరాడాడు.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్‌కు సెదికుల్లా శుభారంభమే అందించాడు. ఆయుష్ వేసిన తొలి ఓవర్లోనే అతడు మూడు బౌండరీలు బాదాడు. కానీ గుర్బాజ్ (8).. ఆయుష్ వేసిన మూడో ఓవర్లోనే వెనుదిరగగా అటీక్ ఇక్బాల్ నాలుగో ఓవర్లో ఇబ్రహీం జద్రాన్ (1)ను బోల్తా కొట్టించాడు. కానీ వెటరన్ బ్యాటర్ మహ్మద్ నబీ (33)తో కలిసి సెదికుల్లా ఆఫ్గాన్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 51 రన్స్ జోడించారు. కించిత్.. 11, 13వ ఓవర్లలో నబీ, గుల్బాదిన్ (5)ను ఔట్ చేశాడు. గుల్బాదిన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా హాంకాంగ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. హాంకాంగ్ ఫీల్డర్లు మూడుసార్లు క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన సెదికుల్లా.. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాక బ్యాట్‌కు పనిచెప్పాడు. ఇక్బాల్ 17వ ఓవర్లో అతడు రెండు భారీ సిక్సర్లు, ఓ బౌండరీ కొట్టాడు. ఇక ఆయుష్ 19వ ఓవర్లో అజ్మతుల్లా.. హ్యాట్రిక్ సిక్సర్లతో పాటు ఓ ఫోర్ కొట్టి 20 బంతుల్లోనే అర్ధశతకం పూర్తిచేశాడు. 16 ఓవర్లకు 119/4తో ఉన్న అఫ్గాన్.. చివరి 4 ఓవర్లలో 69 రన్స్ రాబట్టింది.
ఛేదనలో హాంకాంగ్ బ్యాటర్లు పోరాడకుండానే చేతులెత్తేశారు. ఆరంభంలో ఆ జట్టు స్కోరుబోర్డుపై పరుగుల కంటే వికెట్లనే ఎక్కువగా కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 4.3 ఓవర్లలో హాంకాంగ్.. 22 రన్స్‌కే 4 వికెట్లు నష్టపోయింది. జీషన్ అలీ (5), అన్షుమన్ (0), నిజకత్ (0), కల్హన్ (4), కించిత్ (6) అలా వచ్చి ఇలా వెళ్లారు. బాబర్ హయాత్ ఒక్కడే అఫ్గాన్ బౌలర్లను దీటుగా ఎదుర్కున్నాడు. కానీ 13వ ఓవర్లో గుల్బాదిన్ అతడి ఆట కట్టించాడు. అతడి తర్వాత కెప్టెన్ యాసిమ్ ముర్తాజా (16) ఆ జట్టులో రెండంకెల స్కోరు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. గుల్బాదిన్ (2/8), ఫజల్హక్ (2/16) తలా రెండు వికెట్లు పడగొట్టారు.
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 188/6 (సెదికుల్లా 73*, అజ్మతుల్లా 53, కించిత్ 2/24, ఆయుష్ 2/54);
హాంకాంగ్: 20 ఓవర్లలో 94/9 (బాబర్ 39, యాసిమ్ 16, గుల్బాదిన్ 2/8, ఫరూఖీ 2/16)