‘గ్రూప్ స్టేజ్ దాటితే గొప్ప, సూపర్ 8కు వస్తే అదృష్టం!!’ ఇదీ ఇన్నాళ్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు మీద ఉన్న భావన. కానీ కరేబియన్ గడ్డపై కాబూలీలు కొత్త చరిత్ర లిఖించారు. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అంచనాలకు మించి రాణించిన ఆ జట్టు తాజాగా టీ20 ప్రపంచకప్‌లోనూ అదరగొడుతోంది. తాలిబన్ల చెరలో నలిగిపోతున్న ఆ దేశ భావితరానికి ‘దిక్సూచి’గా నిలుస్తూ తొలిసారి ఓ ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి తమ దేశంలో ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకోవాలనుకుంటున్న కుర్రాళ్లకు కొత్తదారి చూపారు. సూపర్-8లో బంగ్లాదేశ్‌తో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బ్యాట్‌తో అంతగా ఆకట్టుకోలేకపోయినా తమకు అచ్చొచ్చిన బంతితో మాత్రం సత్తాచాటారు. చేసింది స్వల్ప స్కోరే అయినప్పటికీ కాబూలీ బౌలర్ల ‘పట్టు’దల ముందు బంగ్లా పులులు తోకముడవక తప్పలేదు. చరిత్రాత్మక విజయంతో కంగారూల దింపుడుగల్లం ఆశలపై నీళ్లు చల్లిన అఫ్గానులు.. గురువారం (జూన్ 27) దక్షిణాఫ్రికాతో జరిగే తొలి సెమీస్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు.
కింగ్స్టౌన్ (సెయింట్ లూసియా): టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ సంచలనాల జైత్రయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లకు షాకిచ్చిన ఆ జట్టు సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను 8 పరుగుల (డక్‌వర్త్ లూయిస్ విధానంలో)తో ఓడించి ఐసీసీ టోర్నీలలో తొలిసారి సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. వర్షం కారణంగా 19 ఓవర్లలో 114 పరుగులకు కుదించిన ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగుల వద్దే ఆగిపోయింది. రషీద్ ఖాన్ (4/23), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ నవీనుల్ హక్ (4/26) బంగ్లాను కట్టడిచేశారు. లిటన్ దాస్ (49 బంతుల్లో 54 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్) పోరాడినా బంగ్లాకు పరాభవం తప్పలేదు. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన అఫ్గాన్ నిర్ణీత ఓవర్లలో 115 పరుగులే చేయగలిగింది. రెహ్మనుల్లా గుర్బాజ్ (55 బంతుల్లో 43, 3 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్ గత మ్యాచ్‌ల కంటే భిన్నంగా సాగింది. బంగ్లా బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ బంతులతో కట్టడి చేయడంతో ఓపెనర్లకు పరుగుల రాక కష్టమైంది. 29 బంతులాడిన జద్రాన్ 18 పరుగులే చేశాడు. గుర్బాజ్ కూడా బ్యాట్ ఝుళిపించలేకపోయాడు. అజ్మతుల్లా (10) విఫలమయ్యాడు. బంగ్లా స్పిన్నర్ రిషద్ హోసెన్ (3/26) జద్రాన్‌తో పాటు ప్రమాదకర గుల్బాదిన్‌ను ఔట్ చేశాడు. 16 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా గుర్బాజ్ వేగంగా ఆడలేకపోయాడు. అతడూ రిషద్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు. ఆఖర్లో కెప్టెన్ రషీద్ (10 బంతుల్లో 19 నాటౌట్, 3 సిక్సర్లు)మెరుపులతో ఆ జట్టు మూడంకెల స్కోరును దాటింది.
బ్యాట్‌తో విఫలమైనా బంతితో మాత్రం అఫ్గాన్ అదరగొట్టింది. రెండో ఓవర్లోనే ఫరూఖీ.. తాంజిద్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని బంగ్లా వికెట్ల పతనానికి తెరతీశాడు. నవీనుల్ మూడో ఓవర్ వరుస బంతుల్లో శాంటో (5), షకిబ్ అల్ హసన్(0)ను పెవిలియన్‌కు చేర్చి ఆ జట్టును దెబ్బతీశాడు. రషీద్ రంగ ప్రవేశంతో బంగ్లా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యి మీద పడ్డైట్టెంది. సౌమ్య సర్కార్ (10), తౌవిద్ (14), రిషద్ (0) అతడి స్పిన్ మాయకు కుదేలయ్యారు. లిటన్ పోరాడినా నవీనుల్ లోయరార్డర్ పని పట్టి అఫ్గాన్‌ను సెమీస్‌కు చేర్చాడు.
టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై చారిత్రక విజయం సాధించిన వేళ అఫ్గానిస్థాన్‌లో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ఐసీసీ మెగాటోర్నీల్లో తొలిసారి తమ దేశ జట్టు సెమీస్‌కు అర్హత సాధించడంతో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రోడ్లమీదికి వచ్చి సంతోషంలో మునిగితేలారు. ఈ సందర్భంగా తమ దేశ క్రికెట్‌కు సహకరించిన బీసీసీఐకి తాలిబన్ ప్రభుత్వం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
1 ఐసీసీ టోర్నీలలో సెమీఫైనల్ చేరడం అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలిసారి.
అఫ్గానిస్థాన్: 20 ఓవర్లలో 115/5 (గుర్బాజ్ 43, రషీద్ 19 నాటౌట్, రిషద్ 3/26, టస్కిన్ 1/12).
బంగ్లాదేశ్: 17.5 ఓవర్లలో 105 ఆలౌట్ (లిటన్ 54 నాటౌట్, తౌవిద్ 14, రషీద్ 4/23, నవీనుల్ 4/26)