దుబాయ్: ఆసియాకప్లో అఫ్గానిస్థాన్ అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం తమ తొలి మ్యాచ్లో శ్రీలంకపై 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 106 పరుగుల లక్ష్యఛేదనలో అఫ్గాన్ 10.1 ఓవర్లలో 106/2 స్కోరు చేసింది. లంక బౌలింగ్ దాడిని దీటుగా ఎదుర్కొంటూ ఓపెనర్లు హజ్రతుల్లా(37 నాటౌట్), గుర్బాజ్(40) జట్టుకు అలవోక విజయాన్నందించారు. తొలుత ఫారుఖీ(3/11), ముజీబుర్ రెహమాన్(2/24), మహమ్మద్ నబీ(2/14)ధాటికి లంక 19.4 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. భానుక రాజపక్స(38), కరుణరత్నె(31) మినహా అందరూ విఫలమయ్యారు. ఫారుఖీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.