Team India : పొట్టి ప్రపంచ కప్ విజేతగా భారత జట్టు ఆసియాలో తొలి పర్యటనకు సమాయత్తమవుతోంది. హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఆధ్వర్యంలో జూలై 21 సోమవారం భారత బృందం లంక విమానం ఎక్కనుంది. దాంతో, గంభీర్ కోచ్‌గా తొలి పరీక్షలో నూటికి నూరు మార్కులు కొట్టేసేందుకు వ్యూహాలు రచిస్తున్నాడు. ఇప్పటికే వన్డే, టీ20 స్క్వాడ్ ఎంపికలో తన ముద్ర వేసిన గౌతీ.. ఇప్పుడు తనకు నచ్చిన సహాయక కోచ్‌లను నియమించుకున్నాడు.
అవును.. టీమిండియా సహాయక కోచ్‌లుగా అభిషేక్ నాయర్, రియాన్ టెన్ డస్చేట్(Ryan ten Doeschate)లు, ఫీల్డింగ్ కోచ్‌గా టి. దిలీప్ కుమార్‌లు లంక పర్యటనకు వెళ్లనున్నారు. టీమిండియా కోచ్‌గా ఎంపికైన గంభీర్ తనకు నచ్చిన టీమ్ కోసం పట్టుపట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్ సహచరులైన అభిషేక్ నాయర్, రియాన్ డస్చేట్లను అసిస్టెంట్ కోచ్‌లుగా కావాలని గౌతీ కోరాడు.
రియాన్, గంభీర్, అభిషేక్

అంతేకాదు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా దక్షిణాఫ్రికా లెజెండ్ మోర్నీ మోర్కెల్ పేరును గంభీర్ సూచించాడు. కానీ, బీసీసీఐ మాత్రం భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్‌కు ఆ పోస్ట్ ఇవ్వాలని భావిస్తోంది. లంక పర్యటనలో తొలి టీ20కి వారం రోజులే ఉండడంతో ఆలోపు బౌలింగ్ కోచ్ పేరు ఖరారయ్యే అవకాశముంది.

భారత జట్టు శ్రీలంక గడ్డపై జూలై – ఆగస్టుల మధ్య మూడు వన్డే, టీ20ల సిరీస్ ఆడనుంది. జూలై 27న టీ20 సిరీస్ మొదలవ్వనుండగా.. ఆగస్టు 2వ తేదీన వన్డే సమరం షురూ కానుంది. వన్డేలకు రోహిత్ శర్మ, పొట్టి ఫార్మాట్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
🆙 Next 👉 Sri Lanka 🇱🇰#TeamIndia are back in action with 3 ODIs and 3 T20Is#INDvSL pic.twitter.com/aRqQqxjjV0
— BCCI (@BCCI) July 18, 2024