దుబాయ్: పాకిస్థాన్‌తో జరిగే ఆసియాకప్(Asia Cup) ఫైనల్లో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా ఆడేది డౌట్‌గా ఉంది. సూపర్ ఫోర్ స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో ఇండియా నెగ్గిన విషయం తెలిసిందే. అయితే ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, బ్యాటర్ అభిషేక్ శర్మ శ్రీలంక ఇన్నింగ్స్ సమయంలో ఇబ్బంది పడ్డారు. బౌలింగ్‌లో ఒకే ఒక్క ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా.. ఆ తర్వాత ఫీల్డింగ్‌కు రాలేదు. ఇక అభిషేక్ శర్మ కూడా ఫీల్డింగ్‌కు రాలేదు. కండరాలు పట్టేడం వల్ల ఆ ఇద్దరూ ఇబ్బంది పడుతున్నారని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కల్ తెలిపారు.
పాండ్యా ఒకే ఒక్క ఓవర్ వేసి ఆ తర్వాత ఫీల్డింగ్ కూడా చేయలేకపోవడం ఆందోళనకరమైన అంశమే అని బౌలింగ్ కోచ్ మోర్కల్ తెలిపారు. మీడియా సమావేశంలో మోర్కల్ మాట్లాడుతూ కండరాలు పట్టేయడంతో ఇద్దరు ఆటగాళ్లు ఇబ్బందిపడుతున్నట్లు చెప్పాడు. శనివారం లేదా ఆదివారం ఉదయం హార్దిక్ పరిస్థితిని అంచనా వేసి తుది నిర్ణయం తీసుకుంటాంమన్నాడు. ప్రస్తుతం అభిషేక్ పరిస్థితి బాగానే ఉందన్నాడు.