First Ball Sixer : అంతర్జాతీయ టీ20ల్లో భారత క్రికెటర్లు దంచికొడుతున్నారు. ఐసీసీ టోర్నీ అయినా.. ద్వైపాక్షిక సిరీస్ అయినా తమ దూకుడైన ఆటతో బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. పొట్టి ఫార్మాట్లో సూపర్ స్టార్లుగా ఎదుగుతున్నారు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ (Abhishek Sharma) వంటి ఆటగాళ్లు. ఐపీఎల్‌తో డాషింగ్ ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ మరో ఘనత సాధించాడు. ఇంటర్నేషనల్ టీ20 ఇన్నింగ్స్ తొలి బంతికే సిక్సర్ బాదిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.
ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో యూఏఈ(UAE)పై అభిషేక్ సుడిగాలిలా చెలరేగాడు. 58 పరుగుల స్వల్ప ఛేదనలో ఈ చిచ్చరపిడుగు ఇన్నింగ్స్ తొలి బంతినే స్టాండ్స్‌లోకి పంపాడు. ఇదివరకే తన విధ్వంసక ఆటతో పొట్టి ఫార్మాట్ ఓపెనర్‌గా స్థిరపడిపోయాడీ యంగ్‌స్టర్. అయితే.. అతడి కంటేముందు రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ మాత్రమే ఫస్ట్ బాల్ సిక్సర్ ఫీట్ సాధించారు.
Abhishek Sharma’s strike rate is the highest among batters with 500+ T20I runs 💥 pic.twitter.com/XP5HjOBTIx
— ESPNcricinfo (@ESPNcricinfo) September 10, 2025
హిట్‌మ్యాన్ 2021లో ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఓవర్లో మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. నిరుడు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో సికిందర్ రజా వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతిని యశస్వీ జైస్వాల్ అమాంతం స్టాండ్స్‌లోకి పంపాడు. టీ20 స్పెషలిస్ట్‌గా ముద్ర పడిన సంజూ శాంసన్ కూడా ఈ ఏడాది ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఓవర్లో సిక్సర్‌తో ఈ క్లబ్లో చేరాడు.