ముల్తాన్(పాకిస్థాన్): ఇంగ్లండ్, పాకిస్థాన్ తొలి టెస్టులో రికార్డుల వెల్లువ కొనసాగుతున్నది. ముల్తాన్ పిచ్‌పై ఇరు జట్ల బ్యాటర్లు పరుగుల వరద పారిస్తున్నారు. ఓవర్‌నైట్ స్కోరు 492/3 నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్ 823/7 వద్ద డిక్లేర్ చేసింది. హ్యారీ బ్రూక్(322 బంతుల్లో 317, 29ఫోర్లు, 3సిక్స్‌లు), జోరూట్(375 బంతుల్లో 262, 17ఫోర్లు) శతక గర్జన చేశారు. వీరిద్దరు పాక్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ రికార్డులు కొల్లగొట్టారు.
టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రూక్..రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీతో చెలరేగితే రూట్..తన కెరీర్లో ఆరో డబుల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. దీనికి తోడు టెస్టుల్లో ఒక జట్టు 800 స్కోరు చేయడం ఓవరాల్‌గా ఇది నాలుగోసారి కాగా, ఈ శతాబ్దంలో ఇది మొదటిది కావడం విశేషం.
బ్రూక్, రూట్ కలిసి నాలుగో వికెట్‌కు 454 పరుగుల భాగస్వామం నెలకొల్పి జట్టుకు రికార్డు స్కోరు అందించారు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌కు దిగిన పాక్..152 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. అట్కిన్సన్ బ్రైడన్ కర్స్ రెండేసి వికెట్లతో పాక్ పతనాన్ని శాసించారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న పాక్..ప్రస్తుతం 115 పరుగుల వెనుకంజలో ఉన్నది.