హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఈ నెల 29న ‘చలో మైదాన్’ పేరిట యువ క్రీడా సమ్మేళనాలు నిర్వహించేందుకు సాట్స్ సన్నాహాలు చేస్తున్నది. మిగతా రాష్ర్టాల కంటే మన రాష్ట్రంలో ఉత్సాహపూరిత వాతావరణంలో వేడుకలు చేయాలని సాట్స్ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 17 వేల గ్రామీణ క్రీడా ప్రాంగణాలు, 75నియోజకవర్గ స్టేడియాలు, 33 జిల్లా కేంద్రాల్లో ఉన్న మైదానాలు యువతతో కళకళలాడే విధంగా సాట్స్ కార్యక్రమాలు రూపొందిస్తున్నది.
ముఖ్యంగా 15 నుంచి 36 ఏండ్ల వయసు కల్గిన యువతను లక్ష్యంగా ఎంచుకుని వివిధ స్వచ్చంద సంస్థల సహకారంతో జిల్లా కేంద్రాల్లో ‘ఆటల ద్వారా ఆరోగ్యం, ఆనందం, అభివృద్ధి అన్న సందేశాన్ని ప్రచారం చేయనుంది. జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో స్థానిక ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ పేర్కొన్నారు. ప్రతీ జిల్లా కేంద్రంలో మూడు నుంచి ఐదు వేల మంది యువత పాల్గొనే విధంగా సాంస్కృతిక, వినోద కార్యక్రమాల రూపకల్పన జరుగుతుందని ఆయన తెలిపారు.