Swiss Cyclist : సైక్లింగ్ అంటే అతడికి ప్రాణంతో సమానం. కొండ ప్రాంతాల గుండా సాగే ఈ పోటీల్లో ఇప్పటికే ఎన్నోసార్లు గెలిచి పేరు తెచ్చుకున్నాడు. అదే ఉత్సాహంతో రేస్‌కు వచ్చాడు. మరికాసేపట్లో ఫినిషింగ్ లైన్‌ను దాటుతాను అనుకున్న అతడిని ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద సంఘటన స్విట్జర్లాండ్‌లో జరిగింది. ఆ దేశానికి చెందిన 26 ఏళ్ల సైక్లిస్ట్ గినో మడెర్(Gino Mader) ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. టూర్ దే సుసే(Tour de Suisse) ఐదో రౌండ్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న గినోకు అదే ఆఖరి రోజు అయింది. ఈ రేసులో అతడు టీమ్ బహ్రెయిన్ విక్టోరియస్(Bahrain Victorious) తరఫున పాల్గొన్నాడు.
గురువారం జరిగిన రేస్‌లో గినో మరికాసేపట్లో ఫినిషింగ్ లైన్ చేరతాడనగా.. అల్బులా పాస్(Albula Pass) వద్ద అమెరికాకు చెందిన రైడర్ మాగ్నస్ షెఫీల్డ్(Magnus Sheffield)ను వేగంగా ఢీ కొట్టాడు. వెంటనే అదుపుతప్పి పక్కన ఉన్న పెద్ద లోయలో పడిపోయాడు. నిర్వాహకులు అక్కడికి వెళ్లి చూసే సరికి గినో అచేతనంగా కనిపించాడు. వెంటనే అతడిని హెలిక్యాప్టర్ ద్వారా చుర్(Chur)లోని ఆస్పత్రికి తరలించారు. గినోను బతికించేందుకు అక్కడి డాక్టర్లు ఎంతగానో పరిశీలించారు. మెరుగైన వైద్యం అందిచినా కూడా అతడి శరీరం సహకరించలేదు. దాంతో, గినో శుక్రవారం ఉదయం చనిపోయాడు.
‘గినో ఒక టాలెంటెడ్ సైక్లిస్ట్ మాత్రమే కాదు. అతనొక గొప్ప మనిషి. అతడి అకాలమరణం మమ్మల్ని ఎంతగానో కలిచి వేసింది. ఆట పట్ల అతడికున్న అంకితభావం మా అందరికి స్ఫూర్తిదాయకం. ఈ విషాద సమయంలో అతడి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో మా ప్రార్థనలు, ఆలోచనలు అతడి ఫ్యామిలీ గురించే ఉంటాయి’ అని బహ్రెయిన్ విక్టోరియస్ టీమ్ డైరెక్టర్ మిలన్ ఎర్జెన్(Milan Erzen) ఒక ప్రకటనలో తెలిపాడు.