ములుగు రూరల్, డిసెంబర్24 : జాతీయ స్థాయి కరాటే పోటీలకు రాష్ట్రం నుంచి 24 మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఎస్జీఎఫ్ కరాటే పోటీల రాష్ట్ర కార్యదర్శి అజ్మీరా నాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కరాటే అండర్-19 పోటీలు ములుగు గిరిజన భవన్లో జరిగాయి. ఇందులో ఉమ్మడి పది జిల్లాల నుంచి మొత్తం 240 మంది బాలబాలికలు వివిధ కేటగిరీలో పోటీపడ్డారు.
బాలికల విభాగంలో 11 మందిని, బాలుర కేటగిరీలో 13 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేశామని పేర్కొన్నారు. రంగారెడ్డి నుంచి ఐదుగురు, మహబూబ్నగర్, మెదక్, వరంగల్ నుంచి ఇద్దరేసి చొప్పున జాతీయ టోర్నీకి ఎంపికయ్యారు. వీరంతా వచ్చే నెల 27వ తేదీన పుణెలో జరిగే జాతీయ స్థాయి కరాటే టోర్నీలో పోటీపడుతారని తెలిపారు. ప్లేయర్లను ఎంపిక చేసిన వారిలో క్రీడల కన్వీనర్ శ్రీధర్, మల్లయ్య, కనకరాజు, పాపయ్య, సమ్మయ్య, శ్రీను, రాజు, విజయ్, హుస్సేన్ ఉన్నారు.