హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు చదువులోనే కాదు క్రీడల్లోనూ పతకాల పంట పండిస్తున్నారు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. అద్భుతాలు సృష్టిస్తామని చేతల్లో చూపిస్తున్నారు. తిరువణ్ణమలై (తమిళనాడు) వేదికగా జరిగిన 21వ జాతీయ జూనియర్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో దిండి అకాడమీ యువ అథ్లెట్ చెరిపెల్లీ కీర్తన కాంస్య పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన మహిళల 3000మీటర్ల స్టిపుల్చేజ్ ఫైనల్ రేసును కీర్తన 11:42:65 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచింది. సోనమ్(ఢిల్లీ), మోనిక(రాజస్థాన్) వరుసగా స్వర్ణ, రజత పతకాలు సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉంటే జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన కీర్తన ప్రస్తుతం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. 2019లో దిండి అథ్లెటిక్స్ అకాడమీలో చేరిన కీర్తన అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పటికే పలు జాతీయ స్థాయి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. భవిష్యత్‌లోనూ ఇదే జోరుతో మరిన్ని పతకాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది.