Team India | పల్లెకెలె(శ్రీలంక): సూర్యకుమార్, గౌతం గంభీర్ శకానికి అద్భుత ఆరంభం లభించింది. టీ20 ప్రపంచ చాంపియన్ హోదాలో భారత్..శ్రీలంకపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 213/7 స్కోరు చేసింది. కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (26 బం తుల్లో 58, 8ఫోర్లు, 2సిక్స్‌లు) , రిషబ్ పంత్ (33 బంతుల్లో 49, 6ఫోర్లు, సిక్స్), యశస్వి జైస్వాల్(21 బంతుల్లో 40, 5ఫోర్లు, 2సిక్స్‌లు) విజృంభించారు. ఓపెనర్లు జైస్వాల్, శుభ్‌మన్ గిల్(34) మెరుగైన శుభారంభాన్నిచ్చారు. రోహిత్‌శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు కనిపించకుండా లంక బౌలర్లపై ఆది నుంచే బ్యాట్లు ఝులిపించారు.
వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే వీరిద్దరు బంతి తేడాతో నిష్క్రమించడంతో జట్టు ఒకింత ఒత్తిడిలోకి వెళ్లింది. ఈ తరుణంలో కెప్టెన్ సూర్యకుమార్, పంత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ముఖ్యంగా మిస్టర్ 360 తనదైన శైలిలో షాట్లు ఆడుతూ లంక బౌలర్లకు చుక్కలు చూపెట్టాడు. పిచ్‌పై బంతి పడటం ఆలస్యం స్టాండ్‌లోకి పం పిస్తూ స్కోరుబోర్డును పరిగెత్తించాడు. ఈ క్రమం లో అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు. హార్దిక్ (9), పరా గ్(7), రింకూసింగ్(1) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. పతిరణ(4/40)నాలుగు వికెట్లు తీశాడు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన లంక 19.2 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. నిస్సనక(79), కుశాల్ మెండిస్ (45) ఆకట్టుకోగా, మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. పరాగ్ (3/5), అర్ష్‌దీప్‌సింగ్ (2/24), అక్షర్‌పటేల్ (2/38) రాణించారు. సూర్యకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఇరు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 పోరు జరుగనుంది.
16 అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌లు సూర్యకుమార్ ఖాతాలో ఉన్నాయి. కోహ్లీ(16), రజా(15) ఆ తర్వాత ఉన్నారు.
భారత్: 20 ఓవర్లలో 213/7(సూర్యకుమార్ 58, పంత్ 49, పతిరణ 4/40, హసరంగ 1/28),
శ్రీలంక: 19.2 ఓవర్లలో 170 ఆలౌట్(నిస్సనక 79, మెండిస్ 45, పరాగ్ 3/5, అర్ష్‌దీప్‌సింగ్ 2/24)