భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో కొత్త కార్యవర్గం కొలువు దీరింది. మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లో సభ్యులు ఎలాంటి పోటీలేకుండా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ నుంచి బాధ్యతలు అందుకున్న మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ అధ్యక్ష పదవిని అధిరోహించాడు. 1983 ప్రపంచకప్ హీరో బిన్నీ బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా ఆసీనుడయ్యాడు. కార్యదర్శిగా జై షా, ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లా, కోశాధికారిగా అశిష్ షెలార్, సంయుక్త కార్యదర్శిగా దేవిజిత్ సైకియా బాధ్యతలు అందుకున్నారు. ఐదు జట్లతో కూడిన మహిళల ఐపీఎల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఏజీఎమ్..ఐసీసీ చైర్మన్ పదవిపై ఎలాంటి స్పష్టత లేకుండానే ముగిసింది.
ముంబై: బీసీసీఐలో కొత్త శకానికి నాంది పడింది. సౌరవ్ గంగూలీ చరిష్మాకు ఫుల్స్టాప్ పెడుతూ రోజర్ బిన్నీ బోర్డు బాస్‌గా పదవిని అలకరించాడు. మంగళవారం అన్ని రాష్ర్టాల క్రికెట్ సంఘాల ప్రతినిధుల సమక్షంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్)లో బీసీసీఐ నూతన కార్యవర్గం బాధ్యతలు తీసుకుంది. ఎలాంటి పోటీలేకుండా జరిగిన ఎన్నికలు పూర్తి ఏకగీవ్రంగా ముగిశాయి. ముందే అనుకున్నట్లు పక్కా ప్రణాళిక ప్రకారం కేంద్ర ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాఫీగా సాగాయి.
1983 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలువడంలో కీలక భూమిక పోషించిన బిన్నీ..గంగూలీ తర్వాత బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. వివాదాలకు ఆమడ దూరం ఉంటూ సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న బిన్నీ సారథ్యంలో బీసీసీఐ ముందుకు నడవనుంది. భారత్ తరఫున 27 టెస్టులు, 72 వన్డేలాడిన 67 ఏండ్ల బిన్నీ..బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.
వచ్చే ఏడాది స్వదేశం వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో బిన్నీ నేతృత్వంలోని బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి తోడు వచ్చే ఏడాది పాత ఫార్మాట్లో జరిగే ఐపీఎల్‌కు తోడు ఐదు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహణ బిన్నీ ముందున్న సవాళ్లు. ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు తీర్పుననుసరించి వరుసగా రెండోసారి కార్యదర్శి పదవిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా అందుకున్నాడు.
గంగూలీని తప్పించిన విషయంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జై షా బోర్డులో అన్నీతానై వ్యవహరించే అవకాశముంది. ఇదే జరిగితే బిన్నీ అనామక అధ్యక్షుడిగా మారే చాన్స్ కనిపిస్తున్నది. ఎవరూ మారినా తన స్థానాన్ని పదిలపరుచుకోవడంలో ముందుండే రాజీవ్‌శుక్లాకు ఉపాధ్యక్ష పదవి దక్కగా, మహారాష్ట్ర బీజేపీ నేత అశిష్ షెలార్ కోశాధికారిగా, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సన్నిహితుడు దేవజిత్ సైకియా సంయుక్త కార్యదర్శిగా పదవులు అందుకున్నారు. బ్రిజేశ్ పటేల్ స్థానంలో కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ సోదరుడు అరుణ్ ధుమాల్ ఐపీఎల్ చైర్మన్ ఎన్నిక లాంఛన ప్రాయమే కానుంది. ఇన్ని రోజులు సేవలందించిన పాత పాలక వర్గ సభ్యుల సేవలను జనరల్ బాడీ ప్రశంసించింది.
ఐసీసీ చైర్మన్‌పై అస్పష్టత:
బీసీసీఐ ఏజీఎమ్‌లో ఐసీసీ చైర్మన్ ఎన్నికపై ఎలాంటి స్పష్టత రాలేదు. ముఖ్యంగా బోర్డు అధ్యక్ష పదవి నుంచి గంగూలీని తప్పించిన నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ పదవికి పోటీపడేలా చొరవ తీసుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. ఈనెల 20తో నామినేషన్ల దాఖలుకు ఆఖరు తేదీ కావడంతో అసలు బీసీసీఐ నుంచి పోటీ ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే నెలలో మెల్బోర్న్లో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో చైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. ఒకవేళ ప్రస్తుత చైర్మన్ గ్రెగ్ బార్క్లే రెండోసారి పదవిలో కొనసాగుతాడా లేదా అన్నది త్వరలో తేలనుంది.
మహిళల ఐపీఎల్‌కు ఓకే:ఐదు జట్లతో కూడిన మహిళల ఐపీఎల్‌కు బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మార్చిలో జరిగే ఐపీఎల్లో ఈసారి ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. అయితే ప్లేయర్ల వేలం, టోర్నీని ఎలా నిర్వహించాలనే దానిపై త్వరలో నిర్ణయం ఉంటుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
గాయాలు తగ్గించడంపైనే ఫోకస్: బిన్నీ
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బిన్నీ తన ప్రాధామ్యాలు ఏంటో స్పష్టం చేశాడు. ప్లేయర్ల గాయాలపై మరింత దృష్టి సారించడంతో పాటు దేశవాళీ క్రికెట్లో పిచ్‌లను మెరుగుపర్చడమే తన ఎజెండాలో ముఖ్య అంశాలని బిన్నీ పేర్కొన్నాడు. బిన్నీ మీడియాతో మాట్లాడుతూ ‘ప్లేయర్లు తరుచుగా గాయపడటంపై ప్రధానంగా దృష్టి పెడుతాను. అసలు గాయాలు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తాం. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో మనకు అత్యుత్తమ డాక్టర్లు, ట్రైనర్లు ఉన్నారు. ప్లేయర్లు గాయాల పాలు కావడాన్ని తగ్గించడంతో పాటు త్వరగా కోలుకునేందుకు చర్యలు తీసుకుంటాం’ అని అన్నాడు. మరోవైపు దేశవాళీ క్రికెట్లో పిచ్‌లపై స్పందిస్తూ ‘స్వదేశంలో మరిన్ని స్పోర్టింగ్ పిచ్‌లను తీసుకొస్తాం’ అని బిన్నీ పేర్కొన్నాడు.
మంగళవారం ముంబైలో జరిగిన బీసీసీఐ ఏజీఎమ్‌కు హాజరైన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్