ఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు గాను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) నుంచి తనకు వ్యక్తిగత శిక్షణ కింద రూ. 4.50 లక్షలు, ‘టాప్స్’ స్కీమ్ కింద రూ. 1.48 కోట్లు అందాయన్న వార్తలపై భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప తీవ్రంగా స్పందించింది. తనకు సాయ్ నుంచి గానీ ఇతర సంస్థల నుంచీ ఎలాంటి నిధులూ అందలేదని వెల్లడించింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఆ వార్తలు చూసి నేను షాక్‌కు గురయ్యా. నిధులు రానందుకు నాకేం బాధ లేదు. కానీ మేం తీసుకోకున్నా డబ్బులు పొందామని దేశ ప్రజల ముందు ఇలా చెప్పడం దారుణం. క్యాంపులు, విదేశీ శిక్షణ నిమిత్తం ఖర్చు చేశామని వాళ్లు (సాయ్) చెబుతున్నారు.
కానీ రూ.1.48 కోట్లు వెచ్చించింది నా ఒక్కదానిమీద కాదు. క్యాంపులో ఉన్న వారందరికీ ఖర్చు చేశారు. అదీగాక ఆన్యువల్ క్యాలెండర్ ఫర్ ట్రైనింగ్ కాంపిటీషన్ (ఏసీటీసీ) కోసం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్)కు సాయ్ నుంచి వచ్చినవే తప్ప ప్రత్యేకంగా ఏమీ ఖర్చు చేయలేదు. నాకు వ్యక్తిగతంగా కోచ్ కూడా లేడు. పర్సనల్ ట్రైనర్‌కు నా సొంతంగానే నిధులు ఖర్చు చేశా. నేను ఎవరి నుంచీ ఒక్క రూపాయి అదనంగా తీసుకోలేదు. 2023 నవంబర్ దాకా నా సొంత డబ్బులతోనే టోర్నీలకు వెళ్లాను. మేం ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తర్వాతే మమ్మల్ని (తనీషా క్రాస్టోతో కలిసి) టాప్స్‌లో చేర్చారు. గతేడాది నాకు అటు అసోసియేషన్ నుంచి ఎలాంటి మద్దతూ లేదు. అయినప్పటికీ నా మీద రూ. 1.5 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం సరికాదు’ అని తెలిపింది.