బతుమి: జార్జియాలో జరుగుతున్న మహిళల ఫిడే చెస్ ప్రపంచకప్‌లో సెమీస్ చేరిన భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్.. తమ ప్రత్యర్థులతో జరిగిన గేమ్‌లను డ్రా చేసుకున్నారు. హంపి.. లీ టింగ్జీ (చైనా) మధ్య జరిగిన తొలి సెమీస్ 0.5-0.5తో డ్రాగా ముగిసింది. మరో గేమ్ లో దివ్య సైతం 0.5-0.5తో చైనాకే చెందిన తాన్ జ్యోంగితో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. భారత్, చైనా అమ్మాయిల మధ్య రెండో సెమీస్ గేమ్ బుధవారం జరుగనుంది.
బంగ్లాకు రెండో విజయం
ఢాకా: స్వదేశంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను బంగ్లాదేశ్ మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లోఆ జట్టు 8 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 20 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌట్ అయింది. జేకర్ అలీ (55) ఆ జట్టును ఆదుకున్నాడు. అనిశ్చితికి మారుపేరైన పాక్.. స్వల్ప ఛేదనలో 19.2 ఓవర్లలో 125 పరుగులకు కుప్పకూలింది. ఫహీమ్ అష్రఫ్ (51) ఆఖర్లో పోరాడినా ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.