వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆ జట్టు.. తాజాగా ఆతిథ్య జట్టుతో మొదలైన టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.
విండీస్‌కు తప్పని ఓటమి
జమైకా: వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా విజయాల పరంపర దిగ్విజయంగా కొనసాగుతున్నది. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఆ జట్టు.. తాజాగా ఆతిథ్య జట్టుతో మొదలైన టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. ఇరు జట్ల మధ్య ఆదివారం అర్ధరాత్రి జరిగిన తొలి టీ20లో కంగారూలు.. 3 వికెట్ల తేడాతో కరీబియన్ జట్టును కంగు తినిపించారు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్ (60), షై హోప్ (55) అర్ధశతకాలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షియస్ (4/36) నాలుగు వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఆసీస్.. భారీ ఛేదనను 18.5 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి దంచేసింది. కామెరూన్ గ్రీన్ (26 బంతుల్లో 51), అరంగేట్ర కుర్రాడు మిచెల్ ఒవెన్ (27 బంతుల్లో 50) ధనాధన్ ఆటతో ఆసీస్ మరో ఏడు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది.