శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Siddipet - Nov 16, 2020 , 00:09:58

దొంగలు దొరికారు..

దొంగలు దొరికారు..

సిద్దిపేట టౌన్‌ : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్‌ చేసి కత్తులతో బెదిరించి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను సిద్దిపేట పోలీసులు వాహన తనిఖీల్లో భాగంగా పట్టుకున్నారు. వారి నుంచి 6 తులాల బంగారు ఆభరణాలు, చోరీలకు వినియోగించిన బైక్‌, రూ.900 నగదును స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేట ఏసీపీ విశ్వప్రసాద్‌ ఆయన కార్యాలయంలో సీఐలు పరశురామ్‌గౌడ్‌, సురేందర్‌రెడ్డిలతో కలిసి ఆదివారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. సిద్దిపేట వేములవాడ కమాన్‌ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించగా, ప్రకాశం జిల్లాకు చెందిన శ్రీరామ్‌ శ్రీనివాస్‌, రావినూతల కొండల్‌రావులు పట్టుబడ్డారు. వీరిని విచారించగా వృత్తిరీత్యా మేస్త్రీ పని చేస్తున్నట్లు తెలిపారు. గతంలో శ్రీరామ్‌ శ్రీనివాస్‌ వదిన కొడుకు నరేశ్‌తో కలిసి ఒంటరి మహిళలను బెదిరించి ఆంధ్రా ప్రాంతంలో చోరీలకు పాల్పడి జైలు జీవితం గడిపారు. జైలు నుంచి విడుదలైన శ్రీరామ్‌ శ్రీనివాస్‌ తన పంథాను మార్చుకోలేదు. సొంత ప్రాంతంలో చోరీలకు పాల్పడవద్దని నిర్ణయించుకున్నాడు. తన తాత హోటల్‌లో పరిచయమైన రావినూతల కొండల్‌రావుతో జత కట్టాడు. ఈ క్రమంలో తెలంగాణకు వచ్చిన ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసి వరుసగా చోరీలకు పాల్పడ్డారు. సిద్దిపేట టూటౌన్‌, సిద్దిపేట రూరల్‌ పోలీసు స్టేషన్ల పరిధిలో మహిళలను బెదిరించి చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుంచి 6 తులాల బంగారు ఆభరణాలు, రెండు కత్తులు, ఆక్సోబ్లేడ్‌, బైక్‌, రూ.900 స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. నింధితులను పట్టుకున్న టాస్క్‌పోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు, సిద్దిపేట ట్రాఫిక్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై శంకర్‌, పోలీసు సిబ్బందిని ఏసీపీ విశ్వప్రసాద్‌ అభినందించారు. 

VIDEOS

logo