బుధవారం 03 మార్చి 2021
Siddipet - Nov 10, 2020 , 00:49:07

రైతులకు.. ఇక రందిలేదు

రైతులకు.. ఇక రందిలేదు

రాయపోల్‌ : 

ధరణితో రైతులకు రంది లేకుండా పోయింది. గతంలో రిజిస్ట్రేషన్లు కోసం అనేక ఇబ్బందులు పడుతున్న రైతులు కండ్లముందే క్షణాల్లో రిజిస్ట్రేన్లు అవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ధరణి పోర్టల్‌ రైతులకు ఒక వరంగా మారింది. కాగా, రాయపోల్‌ తహసీల్‌ కార్యాలయంలో సోమవారం ధరణి రిజిస్ట్రేషన్లు కొనసాగాయి. మండలంలోని అంకిరెడ్డిపల్లికి చెందిన సింగదాసరి నాగవ్వకు చెందిన సర్వే నెంబర్‌ 272లోని 12గుంటల భూమి అదే గ్రామానికి చెందిన పిట్ల నర్సింహులు కొనుగోలు చేశారు. రాయపోల్‌కు చెందిన జోగు నర్సయ్యకు చెందిన సర్వే నెంబర్‌ 670, 419, 409లోని 1-4 గుంటల భూమిని నర్సింహులుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్రేషన్‌ ప్రక్రియ కేవలం పది నిమిషాల్లో మండల తహసీల్దార్‌, జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌రెడ్డి, కార్యాలయ సిబ్బందితో కలిసి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులు భూముల కొనుగోలు, వారసత్వ భూములు ఉంటే వెంటనే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటే ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేస్తారని, ప్రతి ఒక్కరూ ధరణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

బాధలు తప్పినయి..

సీఎం  కేసీఆర్‌ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రతి చిన్న పనికి దూర ప్రాంతాలకు వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం మన కండ్ల ముందే పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ అయిపోతుండడంతో చాలా సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. 

- నర్సింహులు,

 రాయపోల్‌ 

ధరణితో తీరిన ఇబ్బందులు ..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ధరణితో రైతులకు ఉన్న ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయాయి. గతంలో రిజిస్ట్రేషన్లు చేసుకొని మ్యుటేషన్‌ కోసం వీఆర్వోలు, కార్యాలయల చుట్టూ తిరిగేవాళ్లం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ధరణిలో పనులు తొందరగా జరుగుతున్నాయి. 

ధరణితో పారదర్శక సేవలు

ఆర్డీవో విజయేందర్‌రెడ్డి

ములుగు :

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో ప్రజలకు పారదర్శకమైన రెవెన్యూ సేవలు అందుతున్నాయని ఆర్డీవో విజయేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రం ములుగులోని తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ధరణిపై ప్రజల్లో మంచి స్పందన వస్తోందన్నారు. ధరణి సేవల అమలు తీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ధరణి సేవలను మరింత విస్తృతం చేసి వేగంగా, మరింత సులభంగా అందించేందుకు కృషి చేస్తున్నా మన్నారు. ధరణి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మర్కూక్‌లో తహసీల్‌ కార్యాలయంలో రిజిస్ట్ట్రేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్‌ యాదగిరెడ్డి ఉన్నారు. 

పైసా ఖర్చు లేకుండా  పనైపోయింది 

దౌల్తాబాద్‌ : 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తోంది. సోమవారం మండల కేంద్రంలో తహసీల్‌ కార్యాలయంలో ధరణి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను తహసీల్దార్‌ శ్రీనివాస్‌రావు, ఆర్‌ఐ ప్రభాకర్‌రావు రెవెన్యూ సిబ్బందితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒకప్పుడు రిజిస్ట్రేషన్‌ కోసం ప్రజలు 30కిలో మీటర్లు ప్రయాణం చేసి రావాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ధరణిని ప్రారంభించి, భూముల రిజిస్ట్రేషన్‌ సులభతరం చేసిందన్నారు. ధరణితో రైతులకు చీకటి రోజులు పోయి ఇప్పుడు రైతులకు అరగంటలో రిజిస్ట్రేషన్‌ అయిపోవడంతో వారి మొఖంలో వెలుగులు కనబడుతున్నాయన్నారు.

గిట్ల వచ్చినం.. గట్ల పనైపోయింది..

నా పేరు సందా కవిత.. మా గ్రామం శేరిపల్లి బందారం. మా మామ పేరు మిది నుంచి నా పేరు మీదికి ఒక ఎకరా 19గుంటల భూమిని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాను. ఇలా వచ్చామో లేదో గట్ల పనైపోయింది. ఎకరం భూమి  పట్టా ఎక్కించుకోవాలంటే ఎంత దిరగాల్నో.. ఎన్ని పైసలు అడుగుతారో అని భయపడ్డం.. ధరణితో పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్‌ అయిపోయింది. సీఎంకేసీఆర్‌కు ధన్యవాదాలు.

- సందా కవిత, మహిళా రైతు, శేరిపల్లి బందారం

చాలా సంతోషంగా ఉంది.. 

మాది శేరిపల్లిబందారం గ్రామం. నా పేరు సందా ఎల్లయ్య, గప్పుడు పట్టాలు ఎక్కాలంటే మేము పడరాని పాట్లు పడ్డం.. పని కోసం మండలం కార్యాలయాలకు పోతే సార్లు రేపురా. మాపు రా.. అని అందురు. కానీ, పని కాకపోయేది. గిప్పుడు మండలంలోనే పట్టాలు అయి పోతున్నాయంటే వచ్చినం. ఒక ఎకరా 19 గుంటలు ఎక్కింది. పట్టా పాస్‌పుస్తకాలు అందజేశారు. 

- రైతు సందా ఎల్లయ్య, శేరిపల్లి బందారం

రిజిస్ట్రేషన్‌ సేవలు సులభతరం

మెదక్‌ రూరల్‌ : 

ధరణి పోర్టల్‌ ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందుబాటులోకి రావడంతో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి. స్లాట్‌ బుక్‌ చేసుకున్న తరువాత జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా వ్యవహరించే తహసీల్దార్‌ సమయం, తేదీ ప్రకారం అర్జీదారుడుకి సేవలు అందిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ పూర్తైన వెంటనే కొనుగోలుదారుడి పేరిట ఆస్తి నమోదు చేసి, అమ్మిన వ్యక్తి నుంచి తొలిగించి అప్పటికప్పుడు పాసు పుస్తకాలను అందజేస్తున్నారు. కొత్త విధానంతో సులభతరమైన సేవలు అందుతుండడంతో రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మెదక్‌ తహసీల్‌ కార్యాలయంలో 10రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మొత్తం ఇప్పటి వరకు 31 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. 

సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి..

మా తండ్రి పట్టా నుంచి నా పేరు మీద 5గుంటలు రిజిస్ట్రేషన్‌ చేసిండు. ధరణితో రిజిస్ట్రేషన్‌ చూస్తుండగానే అయిపోయింది. నేను నమ్మలేకపోయిన.. సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి. రైతులకు బాధలు ఉండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ ధరణిని తీసుకొచ్చిండు. 

- రిజిస్ట్రేషన్‌ పత్రాలతో తండ్రితో రాజు, రాయినిపల్లి

నూతన ఒరవడికి శ్రీకారం..

గజ్వేల్‌ రూరల్‌ :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ధరణి పోర్టల్‌ అన్నదాతల సమస్యలను క్షణాల్లో పరిష్కరిస్తున్నది. ధరణి సేవలను తహసీల్‌ కార్యాలయాల్లో ప్రారంభించడంతో రైతులకు చాలా ఇబ్బందులు తప్పాయి. తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్టేషన్‌ చేసుకున్న కొద్ది సేపట్లోనే రైతుల చేతికి పత్రాలు అందుతుండడంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ధరణితో ఇంటి నుంచి కార్యాలయాలకు వెళ్లినంత సేపట్లోనే పట్టా, మ్యుటేషన్‌ పత్రాలు అందుకొని ఇంటికొస్తున్న రైతుల ముఖాల్లో ఆనందం వ్యక్తమవుతుంది. గజ్వేల్‌ డివిజన్‌ పరిధిలోని అన్ని మండల తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి సేవలను రైతులు వినియోగించుకుంటున్నారు. 

క్షణాల్లో హక్కుపత్రాలు..

ధరణితో ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. దీంతో రైతుల్లో భరోసా పెరిగింది. సంవత్సరాలు గడిచినా భూ సమస్యలు పరిష్కారం కాని రోజులున్నాయి. అలాంటిది ధరణితో అరగంటలోనే రైతులకు భూమికి సంబంధించిన అన్ని హక్కు పత్రాలు అందడంతో న్యాయం జరుగుతుంది.  ఇప్పటి వరకు అమలైన రెవెన్యూ చట్టాల్లో ఎన్నో లొసుగులుండేవి కానీ, నేడు ధరణిలో ఎలాంటి లొసుగులు లేకుండా ప్రభుత్వం రైతుల కోసం ధరణి తీసుకరావడం ఎంతో శుభపరిణామం.

చూస్తుండగానే అయిపోయింది

జగదేవ్‌పూర్‌ : 

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషస్లు సులభతరమయ్యాయి. గతంలో భూముల క్రయవిక్రయాలు జరిపినపుడు రిజిస్ట్రేషన్‌ కోసం మారుమూల పల్లెల నుంచి గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రానికి వెళ్లి భూములను రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి వచ్చేదని చాట్లపల్లి గ్రామానికి చెందిన రైతు జంబుల తిరుపతిరెడ్డి, తేజ అన్నారు. సోమవారం గ్రామంలో కొనుగోలు చేసిన 10గుంటల భూమి రిజిస్ట్రేషన్‌ కోసం శనివారం మీసేవలో స్లాట్‌ బుక్‌ చేసుకోగా.. సోమవారం ఉదయం 11గంటలకు సమయం ఇచ్చారు. అనుకున్న సమయానికే అమ్మకందారు ఎగుర్ల ఎల్లయ్య కొనుగోలు దారులు తేజ రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. గంట సమయంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయి భూమి పట్టా పాసుపుస్తకాలు చేతికి అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ కరుణాకర్‌ రావు, ఆరై బాలకృష్ణ ఉన్నారు.

పట్టా చేతికొచ్చింది..

మిరుదొడ్డి :

 రైతులను కష్టాల నుంచి గట్టెక్కించడానికే సీఎం కేసీఆర్‌ భవంతుడి రూపంలో తెలంగాణ రాష్ట్రంలో జన్మించాడు. నా పేరు సయ్యద్‌ యూసూఫ్‌ బీ, నేను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాను. మా నాన్న సయ్యద్‌ మహబూబ్‌ అలీ 1996వ సంవత్సరంలో, మా తల్లి సయ్యద్‌ అప్పజ్‌ బీ 2008వ సంవత్సరంలో మృతి చెందారు. 

మా అమ్మ నాన్నలకు నలుగురం ఆడ బిడ్డలం. మా తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో చెప్యాల గ్రామంలో నాన్న పేరున ఉన్న సర్వే నెంబర్‌ 258/1/అలో గల 1-30 ఎకరం భూమిని నలుగురం అక్కా చెల్లెండ్లం కలిసి మా పెద్దక్క సయ్యద్‌ ఫాతిమా పేరున రిజిస్టేషన్‌ చేయించాం. మా పెద్దక్క ఫాతిమా కొన్ని నెలల క్రితం చనిపోయింది. అక్క పేరున ఉన్న భూమిని మస్తాన్‌ బీ, ఖాసీమ్‌ బీ మా ఇద్దరు అక్కలు కలిసి చిన్నదానినైనా  నా పేరున సర్వే నెంబర్‌ 258/1/అలో గల 1-30 ఎకరం భూమిని ధరణిలో ఫౌతీ పెట్టించారు. మీ సేవలో దరఖాస్తు చేసుకున్న కొన్ని గంటల్లోనే నాకు అక్క పేరు నుంచి నా పేరున పట్టా పాసుపుస్తకాన్ని అధికారులు అందించారు. గతంలో అయితే ఫౌతీ పెట్టుకున్న కొన్ని నెలలు గడిచినా.. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టినా.. తహసీల్‌ కార్యాలయంలో పట్టా పాసుపుస్తకాలు మాత్రం చేతికి వచ్చేవి కావు. కానీ, ధరణితో ఆ బాధ తీరింది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పట్టా పాసు పుస్తకం చేతికి వచ్చింది. 

అరగంటలో రిజిస్ట్రేషన్లు.. 

అందోల్‌ : 

నిన్న మొన్నటి దాకా భూముల రిజిస్ట్రేషన్‌.. అంటేనే పెద్ద ప్రక్రియ.. భూములు అమ్మేవారు.. కొనేవారు రిజిస్ట్రేషన్‌కు వెళ్లాలంటే పొద్దుగాల లేసి.. బుక్కెడు బువ్వతిని.. టౌన్‌లో ఉన్న కార్యాలయాలకు పరుగుతీసేవారు. కానీ, కాలం మారింది.. రైతుల శ్రేయస్సు కోసం పాటుపడే సీఎం కేసీఆర్‌ రైతులకు రిజిస్ట్రేషన్ల కష్టాలు తొలిగించిండు. పాత రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి ఫోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించి, రైతుల ఇబ్బందులను తొలిగించిండు. వారం రోజులుగా మీసేవ కేంద్రాల్లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న రైతులకు వరస క్రమంలో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. తహసీల్దార్లు రిజిస్ట్రేషన్లతో పాటు వెంటనే మ్యుటేషన్‌ చేసి.. పూర్తి వివరాలు సైతం పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదు చేస్తున్నారు. సోమవారం అందోల్‌ మండలంలో 9 రిజిస్ట్రేషన్లు కాగా.. మరి కొన్ని స్లాట్‌ బుకింగ్‌లు అయ్యాయి. వట్‌పల్లి మండలంలో 4రిజిస్ట్రేషన్లు కాగా, మరో ఇద్దరు రైతులు మంగళవారం రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారు. 

ఇబ్బందులు తొలిగిపోయాయి..

ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్ల విధానం చాలా బాగుంది. పాత విధానంలో అయితే ఓ రోజు రిజిస్ట్రేషన్‌, తర్వాత మ్యుటేషన్‌, పట్టా పాసుపుస్తకంలో నమోదుకు నెలలు, సంవత్సరాలు గడిచేవి. కొత్తగా తీసుకువచ్చిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియతో అన్ని పనులు వెంటనే జరిగిపోయాయి. సోమవారం ఉదయం కార్యాలయానికి రాగా అరగంటలో రిజిస్ట్రేషన్‌ జరిగిపోయింది.

- మల్లమ్మ, మహిళా రైతు, ఖాదీరాబాద్‌ 

చాలా సంతోషమనిపించింది..

మా భూమి రిజిస్ట్రేషన్‌ కోసం సోమవారం తహసీల్‌ కార్యాలయానికి వచ్చిన. పూర్తి వివరాలు పరిశీలించిన అధికారులు అరగంటలో రిజిస్ట్రేషన్‌ పూర్తిచేసి కాగితాలు చేతుల్లో పెట్టిండ్రూ. దీంతో చాలా సంతోషమనిపించింది. 

- రాములమ్మ, గజ్వాడ 

అరగంటలో అయిపోయింది..

ఇంతకాలం భూముల రిజిస్ట్రేషన్ల కోసం రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్తే ఒక్క రోజు మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం కొత్తగా తహసీల్‌ కార్యాలయాల్లో ధరణి పోర్టల్‌ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభించడంతో ఇబ్బందులు తొలిగిపోయాయి. 

- గజ్జాడ గోపయ్య, రైతు 

సమయం వృథా కాలేదు..

ఒక్క రూపాయి లంచం లేకుండా.. భూములు రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ కావడం చాలా సంతోషించనదగిన విషయం. సమయం వృథా కాకుండా ఒకే రోజులో భూమి రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేయడంతో పాటు.. పూర్తి వివరాలు పట్టా పాసుపుస్తకంలో నమోదు చేయడం గొప్ప విషయం. 

- బీరయ్య, రైతు ఖాదీరాబాద్‌


VIDEOS

logo