శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Siddipet - Jun 17, 2020 , 00:28:21

‘పంట’ పండింది గోదాము నిండింది

‘పంట’ పండింది గోదాము నిండింది

l లక్ష్యానికి మించి దిగుబడి వచ్చిన ధాన్యం

l ప్రతి గింజనూ కొనుగోలు చేసిన ప్రభుత్వం

l సిద్దిపేట జిల్లాలో 344 కేంద్రాలు ఏర్పాటు చేశారు

l 2,99,464 మెట్రిక్‌ టన్నుల ధాన్యం ...

l 81,834 మంది రైతుల నుంచి కొనుగోలు

l  రూ.549 కోట్లు రైతులకు చెల్లింపు..

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: సిద్దిపేట జిల్లాలోని ఆయా మండలాల్లో అధికంగా వరిసాగు చేశారు. యాసంగిలో సుమారు లక్షా 50వేల ఎకరాల్లో వరి సాగైంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి ధాన్యం పుట్ల కొద్ది పండింది. 2,99,464 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందిరా క్రాంతి పథం, ప్రాథమిక సహకార వ్యవసాయ కేంద్రాల ఆధ్వర్యంలో మొత్తం 335 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో 334 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఐకేపీ ద్వారా 190 సెంటర్లు, పీఏసీఎస్‌ల ద్వారా 144 సెంటర్లు ఏర్పాటు చేసి 81,834 మంది రైతుల వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రూ.549,51,65,134 విలువ గల ధాన్యాన్ని కొనుగోలు చేసి సుమారు 78,590మంది రైతుల ఖాతాల్లో సుమారుగా రూ.528,55,19,404 జమ చేశారు. కాగా, 2794 మంది రైతుల ఖాతాల్లో 20.96 కోట్లు జమ చేయాల్సి ఉంది. రెండు మూడు రోజుల్లో ఇట్టి డబ్బులు సైతం జమ కానున్నాయి.  

పెరుగనున్న సాగు విస్తీర్ణం

ఇన్నాళ్లూ బోరు బావులపై ఆధారపడి సాగు చేసిన రైతులకు ఇక గోదావరి జలాలు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక, కొండపోచమ్మ రిజర్వాయర్లకు నీళ్లు వచ్చాయి. దసరా నాటికి కాల్వల ద్వారా జిల్లాలోని చెరువులన్నీ నిండనున్నాయి. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో చెరువులకు నీళ్లు రాగా, వచ్చే యాసంగికి సాగు విస్తీర్ణం మరింత పెరుగనున్నది. గత యాసంగిలో జిల్లాలో లక్షా50 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, ప్రస్తుత వానకాలంలో సిద్దిపేట జిల్లాలో 1,50,368 ఎకరాల్లో వరి సాగుకు చేయనున్నారని అధికారుల అంచనా. దీనిలో 60శాతం సన్నరకాలను పెట్టాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. 2,73,401 ఎకరాల్లో పత్తి, 70,120 ఎకరాల్లో కందులు, 710 ఎకరాల్లో జొన్నలు, 2,504 ఎకరాల్లో పెసర్లు, 540 ఎకరాల్లో మినుములు, 505 ఎకరాల్లో ఆముదాలు, 1,815 ఎకరాల్లో ఇతర పంటలు మొత్తం జిల్లాలో 4,99,963 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేయాలని రైతులకు ప్రభుత్వం సూచించింది. రిజర్వాయర్లకు నీళ్లు రావడంతో చెరువులు, కుంటలు నిండి భూగర్భజలాలు పెరుగనున్నాయి. 

లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు 

ధాన్యం కొనుగోలు చేసే సమయానికి కరోనా వచ్చింది. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యాన్ని సేకరించాం. సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు  జిల్లాలో 344 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఐకేపీ, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేశాం. ఈసారి అనుకున్న దానికన్నా ఎక్కువ ధాన్యం వచ్చింది. ధాన్యం సేకరణలో సహకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సెంటర్స్‌ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. - పద్మాకర్‌, సిద్దిపేట అదనపు కలెక్టర్‌

చివరి గింజ వరకూ కొనుగోలు చేశాం..

రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొనుగోలు చేశాం. జిల్లాలో 205 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, 49,857మంది రైతుల నుంచి లక్షా 77వేల 826 మెట్రిక్‌ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. ఇందుకు గానూ రూ.326 కోట్లు రైతులకు చెల్లింపులు చేశాం. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. - నగేశ్‌, మెదక్‌ అదనపు కలెక్టర్‌ logo