బుధవారం 23 సెప్టెంబర్ 2020
Siddipet - Apr 10, 2020 , 02:38:21

భూసేకరణ వేగవంతం చేయాలి

భూసేకరణ వేగవంతం చేయాలి

సిద్దిపేట కలెక్టరేట్‌, నమస్తే తెలంగాణ: ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం వచ్చింది. గ్రామాల్లోని చెరువులు, కుంటలు, వాగులన్నీ నింపాలి. ఇందుకోసం ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌ కార్యాలయంలో బుధవారం రాత్రి అదనపు కలెక్టర్‌ పద్మాకర్‌, ఆర్డీవో అనంతరెడ్డి, ఇరిగేషన్‌ ఎస్‌ఈ ఆనంద్‌, వివిధ మండలాల తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులతో 10, 11వ ప్యాకేజీ రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ రిజర్వాయర్ల కుడి, ఎడమ కాల్వల పనుల పురోగతిపై మంత్రి సమీక్ష జరిపారు. సాగునీటి ప్రాజెక్టులకు కావాల్సిన భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. జిల్లాలోని ఆయా గ్రామాల్లో కాల్వల నిర్మాణాలకు సంబంధించిన భూసేకరణను స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో ప్రత్యేక చొరువ తీసుకొని ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు పూర్తి చేయాలన్నారు. ఇదిలావుండగా, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని అత్యవసర అభివృద్ధి నిర్మాణ పనులకు ఆటంకాలు ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులకు మంత్రి సూచించారు. సమీక్షలో పబ్లిక్‌ అండ్‌ హెల్త్‌ ఈఈ వీరప్రతాప్‌, పంచాయతీరాజ్‌ ఈఈ కనకరత్నం, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ గోపాల్‌, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


logo