న్యూఢిల్లీ : యూజర్ల వ్యక్తిగత సంభాషణలను వాట్సాప్ (WhatsApp) వింటోందని, యూజర్ల సమాచారంపై కన్నేసి ఉంచుతోందనే ఆరోపణలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి వేళ యూజర్ల ఫోన్లలోని మైక్‌ను యాక్సెస్ చేయడం ద్వారా వాట్సాప్ రహస్యంగా యూజర్ల సంభాషణలను వింటోందని దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ట్విట్టర్ ఇంజనీర్ షేర్ చేయడం కలకలం రేపింది. వాట్సాప్ తన యూజర్ల డేటాను మెటాతో పంచుకుంటోందని గతంలో ఆరోపణలు వచ్చిన క్రమంలో యూజర్ల డేటా భద్రత విషయంలో రాజీపడేది లేదని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వివరణ ఇచ్చింది.
యూజర్ల వ్యక్తిగత మెసేజ్‌లను తాము చూడమని, వారి కాల్స్‌ను కూడా వినబోమని యూజర్ల కాంటాక్టులు, లొకేషన్‌ను మెటాతో షేర్ చేయడం లేదని తన హెల్ప్ సెంటర్ వెబ్‌పేజ్‌లో సవివరంగా పోస్ట్ చేసింది. తమ యూజర్ల మెసేజ్‌లకు ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ఆఫర్ చేస్తున్నామని పేర్కొంది. ఆ మెసేజ్‌లు కేవలం మీతో పాటు మీకు మెసేజ్ చేసిన వ్యక్తి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతారని తెలిపింది. వాట్సాప్ సహా ఏ ఒక్కరూ ఈ సమాచారాన్ని యాక్సెస్ చేయలేరని స్పష్టం చేసింది.
యూజర్ల రహస్య సంభాషణలపై వాట్సాప్ నిఘా ?
ఇక తాజా ఆరోపణల విషయానికి వస్తే యూజర్ల ఫోన్లోని మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తూ వారి రహస్య సంభాషణలను వాట్సాప్ వింటోందని ట్విట్టర్ ఇంజనీర్ చేసిన పోస్ట్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ఇబ్బందికర పరిస్ధితిలోకి నెట్టింది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో పాటు వాట్సాప్‌ను నమ్మలేమని ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ స్పందించారు. దీంతో తమ మైక్రోఫోన్ల ద్వారా వాట్సాప్ తమపై నిఘా పెట్టిందనే ఆందోళన వాట్సాప్ యూజర్లను వెంటాడుతోంది.
ఇక ట్విట్టర్ ఇంజనీర్ ఆరోపణలపై వాట్సాప్ స్పందిస్తూ అండ్రాయిడ్‌లో బగ్ కారణంగా ఈ ఇష్యూ తలెత్తిందని పేర్కొంది. ఇంజనీర్ గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడటంతో ఈ వ్యవహారం నిగ్గుతేల్చాలని సెర్చింజన్ దిగ్గజాన్ని వాట్సాప్ పేర్కొంది. మైక్రోఫోన్ సెట్టింగ్స్‌పై యూజర్‌కు పూర్తి పట్టు ఉంటుందని, యూజర్ ఫోన్ మాట్లాడేసమయంలో, వాయిస్ నోట్ లేదా వీడియోను రికార్డు చేసే సమయంలోనే మైక్‌ను యాక్సెస్ చేయవచ్చని తెలిపింది.
బగ్ ఉందని నిర్ధారించిన గూగుల్
ఆండ్రాయిడ్‌లో తప్పుడు సమాచారాన్ని ఉత్పత్తి చేసే బగ్ ఉందని గూగుల్ ప్రతినిధి నిర్ధారించారు. తమ పరిశోధన ఆధారంగా, వాట్సాప్ వినియోగదారులను ప్రభావితం చేసే అండ్రాయిడ్‌లో ఉన్న ఈ బగ్ ప్రైవసీ డ్యాష్‌బోర్డులో తప్పుడు ప్రైవసీ సూచికలు, నోటిఫికేషన్లను ప్రొడ్యూస్ చేస్తోంది. యూజర్ల కోసం తాము దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని గూగుల్ ప్రతినిధి తెలిపారు.
ప్రైవసీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించం
యూజర్ల మైక్రోఫోన్లను వాట్సాప్ రహస్యంగా యాక్సెస్ చేస్తోందనే ఆరోపణలపై కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ఇది గోప్యత నిబంధనలను ఉల్లంఘించడమేనని, దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తుందని, ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా ఉపేక్షించేంది లేదని స్పష్టం చేశారు.
Read More
WhatsApp | వాట్సాప్‌లో మరో సూపర్ ఫీచర్..! మీ చాట్ ఎవరికీ కనిపించకుండా ఇలా లాక్ చేసేయండి
AI Tools | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవాళిని మింగేస్తుంది : ఏఐ స్టార్టప్ చీఫ్ వార్నింగ్