Vitamin D deficiency : మనం శరీరాలపై సూర్యకాంతి (Sun light) కావాల్సినంత పడకపోతే విటమిన్-D (Vitamin-D) లోపం తలెత్తుతుంది. అందుకే ఇంటి గదులకు వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకుంటారు. అయితే భారతదేశం (India) లో సూర్యరశ్మి (Sunshine) కి కొదువలేదు. దేశం నలుమూలలా సూర్యకాంతి ప్రసరిస్తుంది. అయినప్పటికీ తెలంగాణ (Telangana) తోపాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విటమిన్-D లోపం తీవ్రంగా ఉన్నది. దేశంలోని పలు సంస్థలు తాజాగా వెల్లడించిన నివేదికల్లో ఈ విషయం స్పష్టమైంది. దేశంలోని ప్రతి ఐదుగురిలో ఒకరు విటమిన్-D లోపంతో బాధపడుతున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.
ముఖ్యంగా దేశంలోని చిన్నారులు, యుక్త వయస్కులు, గర్భిణిల్లో ఈ విటమిన్-D సమస్య తీవ్రంగా ఉన్నదని నివేదికలు చెబుతున్నాయి. పురుషులతో పోల్చి చూస్తే అన్ని వయసుల్లోనూ మహిళలే ఎక్కువగా విటమిన్-D సమస్యను ఎదుర్కొంటున్నారని, పట్టణాల్లోని మహిళలు ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడం మహిళల్లో సమస్యగా అధికంగా ఉండటానికి కారణమని తాజా నివేదికలు వెల్లడించాయి.
ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ రిసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిసెర్చ్ (ICRIER).. ‘రోడ్ మ్యాప్ టు అడ్రస్ విటమిన్-D డెఫిషియన్సీ ఇన్ ఇండియా’ పేరుతో ఒక నివేదికను రూపొందించి కేంద్ర ఆరోగ్య శాఖకు సమర్పించింది. విటమిన్-D లోపం అనేది దేశంలో నిశ్శబ్దమైన అంటువ్యాధిలా వ్యాపిస్తోందని ఆ నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు. విటమిన్-D లోపం కారణంగా 0 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లల్లో 46 శాతం మంది రికెట్స్ వ్యాధితో బాధపడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. అదేవిధంగా పెద్దవారిలో 80 నుంచి 90 శాతం మంది ఎముకలు విరగడానికి, దీర్ఘకాలిక అంగవైకల్యానికి దారితీసే ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్నారని నివేదిక పేర్కొన్నది.
సాధారణంగా దేశంలో ఏడాది పొడవునా సూర్యరశ్మి లభిస్తుంది. అయితే పెరుగుతున్న కాలుష్య స్థాయిలు, పట్టణీకరణ, ఆధునిక జీవనశైలి మార్పులు శరీరంపై సూర్యరశ్మి పడే సమయాన్ని తగ్గిస్తున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్-B (UVB) కిరణాలు విటమిన్-D కి ప్రధాన వనరు. నగరాల్లో అధిక వాయు కాలుష్యం శరీరాలపై యూవీబీ కిరణాలు పడకుండా అడ్డపడుతోంది. తద్వారా విటమిన్-D సంశ్లేషణను నిరోధిస్తుంది. దాంతో విటమిన్-D లోపం తలెత్తుతోంది.
అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉండటం, ఎముకలు కొరికే చలి ఉక్కిరిబిక్కిరి చేయడం లాంటి కారణాలతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతారు. దాంతో వారిపై సూర్యకాంతి పడే సమయం తగ్గిపోతుంది. ఇది కూడా విటమిన్-D లోపానికి కారణమవుతుంది. పట్టణీకరణ, వేగంగా జనాభా పెరుగుదల కారణంగా నివాసాలు ఇరుకైపోతున్నాయి. బహుళ అంతస్తుల భవనాల్లో వందల కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దాంతో వెంటిలేషన్ సమస్య తలెత్తి విటమిన్-D లోపానికి దారితీస్తోంది. ఎక్కువమంది ఇళ్లు, కార్యాలయాల లోపలే గంటల సమయం గడపడం కూడా విటమిన్-D లోపానికి కారణమవుతోంది.
తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 49 కోట్ల మంది విటమిన్-D లోపంతో బాధపడుతున్నారు. ఆ 49 కోట్ల మందిలో 30 శాతం పిల్లలు, యుక్త వయస్కులే ఉన్నారు. ఇక పట్టణ మహిళల్లో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది. పట్టణాల్లో 80 శాతం మంది మహిళలు విటమిన్-D లోపంతో ఇబ్బంది పడుతున్నారు. విటమిన్-D స్థాయిలు 30 ng/ml కంటే తక్కువగా ఉంటే దాన్ని విటమిన్-D లోపంగా చెప్పవచ్చు. ప్రతిరోజు మనిషి శరీరంలోని 40 శాతంపై 20 నిమిషాలపాటు సూర్యరశ్మి పడితే కావాల్సినంత విటమిన్-D లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.