న్యూఢిల్లీ : టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారిన ఓపెన్ ఏఐ వైరల్ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఏఐ టూల్‌కు యూజర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తుండగా మరోవైపు పలు దేశాలు చాట్‌జీపీటీని బ్యాన్ చేస్తున్నాయి. ప్రైవసీ నిబంధనలపై ఆందోళనతో ఇటలీకి చెందిన డేటా ప్రొటెక్షన్ అథారిటీ గరాంటే చాట్‌జీపీటీని నిషేధించింది.
20 రోజుల్లో తాము లేవనెత్తిన అంశాలను పరిష్కరించని పక్షంలో 21.7 మిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాలని లేదా వార్షిక రాబడుల్లో 4 శాతం చెల్లించాలని స్పష్టం చేసింది. ఇతర యూజర్ల చాట్‌బాట్ సంభాషణల టైటిల్స్‌ను ఓపెన్ఏఐ యూజర్లు చూసేందుకు అనుమతిస్తూ చాట్‌జీపీటీ ప్రైవసీ నిబంధనలకు తూట్లు పొడిచిందని ఇటలీ రెగ్యులేటర్ ఆందోళన వ్యక్తం చేసింది. చాట్‌జీపీటీ ఎలాంటి వయో నిబంధనలు పాటించడం లేదని, కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని కూడా పేర్కొంది.
ఇక చాట్‌జీపీటీని ఇటలీతో పాటు ఉత్తర కొరియా, ఇరాన్, రష్యా, చైనా వంటి దేశాలు బ్యాన్ చేశాయి. చాట్‌జీపీటీ వంటి ఏఐ వేదికలను ఉపయోగించుకుని తప్పుడు సమాచారాన్ని అమెరికా వ్యాప్తి చేస్తుందని చైనా అనుమానిస్తోంది. విదేశీ వెబ్సైట్లపై కఠిన నిబంధనలు, అమెరికాతో డ్రాగన్ సంబంధాలు దెబ్బతిన్న నేపధ్యంలో చాట్‌జీపీటీని చైనా బ్యాన్ చేసింది. చాట్‌జీపీటీ వంటి ఏఐ టూల్స్ దుర్వినియోగం పట్ల మాస్కో కూడా ఆందోళన చెందుతోంది. పశ్చిమ దేశాలతో రష్యా సంబంధాలు బెడిసికొట్టడంతో చాట్‌జీపీటీ వంటి వేదికలను అనుమతిస్తూ రిస్క్ తీసుకోరాదని రష్యా యోచిస్తోంది.
Read More