Microsoft-Twitter | టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌పై ట్విట్టర్ సంచలన ఆరోపణలు చేసింది. తమ డేటా వినియోగంపై మైక్రోసాఫ్ట్ నిబంధనలు అతిక్రమించిందని పేర్కొంటూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు గురువారం లేఖ ట్విట్టర్ లేఖ రాసింది. అలా వాడుకున్న డేటాకు మనీ చెల్లించడానికీ నిరాకరిస్తున్నదని ఆరోపించింది. నిబంధనలకు అనుగుణంగా వాడుకోవాల్సిన దాని కంటే మైక్రోసాఫ్ట్ అధిక డేటా వాడుకుంటున్నదని ట్విట్టర్ తన లేఖలో స్పష్టం చేసింది. అంతే కాదు.. ఏ అనుమతి తీసుకోకుండానే తమ డేటా.. ప్రభుత్వ సంస్థలతో షేర్ చేసుకుంటున్నదని సత్య నాదెళ్లకు ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ పర్సనల్ లాయర్ అలెక్స్ స్పైరో పంపిన లేఖలో వెల్లడించారు. తమ డేటా వాడుకుంటున్న మైక్రోసాఫ్ట్ నుంచి డబ్బు వసూలు చేయడానికే ట్విట్టర్ఈ ఆరోపణలు చేసి ఉండొచ్చునని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. గతేడాది ట్విట్టర్ యాజమాన్యాన్ని 44 బిలియన్ డాలర్లతో ఎలన్ మస్క్ టేకోవర్ చేసుకున్న సంగతి తెలిసిందే.
దాదాపు దివాళా అంచుల్లో చిక్కుకున్న ట్విట్టర్ ను గాడిలో పెట్టేందుకు పలు చర్యలు తీసుకున్నారు. ట్విట్టర్ బ్లూ సబ్ స్క్రిప్షన్ పాలసీ తెచ్చారు. పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా తమ డేటా వాడుకున్న సంస్థల నుంచి డబ్బు వసూలు చేయడం ఒక మార్గంగా ట్విట్టర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మైక్రోసాఫ్ట్ మీద గత నెలలోనే ఎలన్ మస్క్ బహిరంగ ఆరోపణలు చేశారు. మైక్రోసాఫ్ట్ తన ఆర్టిఫిషియల్ టెక్నాలజీ విభాగానికి శిక్షణ ఇవ్వడానికి తమ డేటా అక్రమంగా వాడుకుంటుందని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.
అయితే, తాజాగా ట్విట్టర్ చేసిన ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ రియాక్టయింది. తాము ఇప్పుడు ట్విట్టర్ డేటాకు ఎటువంటి పేమెంట్ చేయడం లేదని స్పష్టం చేసింది. ట్విట్టర్ పంపిన లేఖను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రియాక్ట్ అవుతామని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఫ్రాంక్ షా తెలిపారు. ట్విట్టర్ సంస్థతో దీర్ఘకాల భాగస్వామ్యం కొనసాగించాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఓపెన్ ఏఐ డెవలప్ చేసిన చాట్ జీపీటీ విషయంలో మైక్రోసాఫ్ట్, ఎలన్ మస్క్ మధ్య కొంతకాలంగా సంబంధాలు అంత బాగా లేవు. ఓపెన్ ఏఐ ఏర్పాటులో ఎలన్ మస్క్ పాత్ర కూడా ఉంది. కానీ, ఈ కంపెనీలో మైక్రోసాఫ్ట్ 13 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది మైక్రోసాఫ్ట్. దీంతో ఓపెన్ ఏఐ పూర్తి కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్ నియంత్రిస్తున్నదని ఎలన్ మస్క్ ఆరోపించారు.